నంద్యాల మండలపరిధిలో మంచినీటికి ప్రణాళికలు

కర్నూలు,జూలై10(జ‌నం సాక్షి): నంద్యాల పట్టణానికి శాశ్వతంగా తాగునీటి ఎద్దడి లేకుండా చేసేందుకువెలుగోడు జలాశయం నుంచి పట్టణంలోని చిన్నచెరువు వరకు పైపులైను నిర్మించేందుకు రూ.130 కోట్లు మంజూరు చేశారు. గతేడాది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల పర్యటనలో భాగంగా ఈ పైపులైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. వెలుగోడు నుంచి నంద్యాల పట్టణానికి వస్తున్న పైపులైనుకే చిన్నచెరువు సవిూపంలో మరో పైపులైను వేసి దీనిద్వారా నంద్యాల, గోస్పాడు మండలాలకు తాగునీటికిఅందించేలా ఎంవీఎస్‌ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం నంద్యాల పురపాలికలో అమలుచేయనున్న ‘అమృత్‌’ పథకానికి ఈ పథకం జత కానుంది. దీనికిగాను ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పురపాలిక శాఖకు కొంత నిధులు జమ చేయనుంది. అమృత్‌ పథకంలో పట్టణ ప్రజల భాగస్వామ్యం ఉండటంతో ఈ మేరకు గ్రావిూణ తాగునీటి శాఖ నీటిని వాడుకుంటున్నందున అవసరమైన నిధులను జమ చేయనుంది. ఎంవీఎస్‌కు నంద్యాల పట్టణం నుంచే తాగునీటిని అందించనున్నారు. నంద్యాల నియోజకవర్గంలోని నంద్యాల, గోస్పాడు మండలాల ప్రయోజనార్థం నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుతో 20 ఏళ్ల వరకు తాగునీటి సమస్య రాకుండా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల పర్యటన సందర్భంగా ఇచ్చిన హావిూ మేరకు ప్రస్తుతం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. మల్టీ విలేజ్‌ స్కీం పేరుతో తలపెట్టిన ఈ ప్రాజెక్టుతో 46 గ్రామాలకు పూర్తిస్థాయిలో నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. 2019 నాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2019లో ఉండే జనాభాకు అనుగుణంగా పనులు పూర్తిచేసి ఆపై 20 ఏళ్ల వరకు ప్రస్తుత ప్రాజెక్టు ద్వారానే ప్రతిపాదిత గ్రామాలకు నీళ్లు అందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నంద్యాల ఆర్‌డబ్ల్యూఎస్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిపాదనలు, అంచనాలు చురుగ్గా సాగుతున్నాయి. తాగునీటి పథకం నిర్మాణంలో భాగంగా నంద్యాల పట్టణం

చిన్నచెరువు సవిూపంలోని అబాండం తండా వద్దగాని, పెద్దకొట్టాల వద్ద గాని ఆర్‌ఎస్‌ఎఫ్‌ నిర్మించనున్నారు. దీనికిగాను రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొదట నంద్యాల మండలం వరకే ఈ ప్రాజెక్టును పరిమితం చేయగా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలతో గోస్పాడు మండలం కూడా ఇందులో చేరింది.