నకిలీ విత్తన విక్రేతలకు ఇక డేంజర్ బెల్స్
రంగంలోకి దిగిన పోలీస్ శాఖ
రైతులకు అండగా కఠిన చర్యలకు ఎస్పీ ఆదేశాలు
ఆదిలాబాద్,జూన్9(జనం సాక్షి ): నకిలీ విత్తనాలు విక్రయిస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ శాఖ రంగం సిద్దంచేసింది. ఇంతకాలం కేవలం వ్యవసాయశాఖ తూతూమంత్రంగా కేసులు నమోదు చేసేది. కానీ తాజాగా ఇప్పుడు పోలీసులే రంగంలోకి దిగారు. ఎక్కడ నకిలీ అనిపించినా వెంటనే కేసు పెట్టడం ద్వారా రైతులకు అండగా నిలిచేలా పక్కా వ్యవూహం అమలు చేయబోతున్నారు. ఇదో రకంగా జిల్లా రైతులకు వరం కానుంది. అలాగే ఇబ్బడి ముబ్బడిగా నకిలీ విత్తనాలను అంటగట్టి దండుకోవాలనుకుంటున్న వ్యాపారులకు ముకుతాడు పడనుంది. రైతులు మోస పోకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకోవాలని నిర్ణయించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గతంలో అనేకసందర్భంల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని వాటిని గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించిన వ్యాపారులపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొవాలని పోలీసు అధికారులకు ఆదేశించామని అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసులకు నిర్వహించి తగు సూచనలు చేశారు. నకిలీ విత్తనాలు జిల్లాలో విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని, ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో, జిల్లా కేంద్రంలో విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో పోలీసు అధికారులు నిర్వహించాలని సూచించారు. మండల స్థాయిలో విత్తన దుకాణాలపై ఎస్సైలు నిఘా ఉంచాలన్నారు. రైతులకు అండగా పోలీసులు ఉంటారని ఎలాంటి సమాచారం ఉన్నా డయల్ 100 లేదా జిల్లా పోలీసు వాట్సాప్ నంబర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించినా, తక్కువ ధర ఉందని ప్రలోభ పెట్టి అమ్మినా నేరంగా పరిగణించాలన్నారు. తక్షణమే పోలీసు అధికారులు విత్తన దుకాణాలు, గోదాములలో తనికీలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు విత్తనాలు కొనే ముందు పరిశీలించి జాగ్రత్తగా కొనుగోలు చేయాలని దుకాణదారుని పేరు పై ఉన్న ఒరిజినల్ రసీదును తీసుకోవాలన్నారు. రసీదుపై కొనుగోలు చేసిన విత్తనం పేర్లు రాయించుకోవాలని తెలిపారు. పోలీసు వాట్సాప్‌కు ఫోన్‌ద్వారా సమాచారం అందిన వెంటనే పోలీసులు రైతులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారన్నారు. జిల్లా పోలీసులు నిఘా వర్గాలు విక్రయ దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇదిలావుంటే ఎస్పీ ఆదేశాలు రావడంతో జిల్లాలో గురువారం పలుచోట్ల ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని, విత్తనాలు విక్రయించే సమయంలో స్టాక్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలని, రైతులకు తప్పని సరిగా రసీదు ఇవ్వాలన్నారు. దుకాణంలో నోటీస్ బోర్డులపై స్టాక్ వివరాలు, ధరలు రోజువారీగా రాయాలన్నారు. విత్తనాలు విక్రయించే సమయంలో ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు విక్రయిస్తే తమ సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని తెలిపారు.