నకిలీ విత్తన విక్రేతల ఉచ్చులో అన్నదాతలు
ఆదిలాబాద్,మే19(జనం సాక్షి): నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికే నకిలీలతో మిర్చి, సోయాబీన్, పత్తి రైతులు బాగా నష్టపోయారు. మరోమారు వ్యాపారులు రైతులను తమ నకిలీ విత్తనాలతో ముంచడానికి సిద్దం అవుతున్నారు. గతంలో దుక్కిలో మాత్రమే కలుపు నివారణకు మందులు పిచికారి చేసే పరిస్థితులకు భిన్నంగా పంట దశలో కూడా కలుపు మందును వాడినా పత్తి మొక్కలకు ఎటువంటి నష్టం ఉండదనే ప్రచారంతో వీటి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈసారి సోయా, కంది పంటల్లో నష్టాలను చవిచూడటం వల్ల గతంలో కంటే పత్తి పంట భారీగా సాగయ్యే పరిస్థితులున్నాయి. వివిధ రకాలైన బోగస్ సంస్థల పేర్లుతో ఖాళీ సంచుల్లో పత్తిగింజలను నింపి వాటినే విత్తనాలుగా ఏజంట్ల ద్వారా దొంగచాటుగా విక్రయాలు జరుపుతోంది. నకిలీ విత్తనాల విక్రయదారులపైన పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా.. వాటి విక్రయాల్లో ఏమాత్రం జోరు తగ్గలేదు. ఏళ్లతరబడి నకిలీ విత్తనాలనే విక్రయించిన ముఠాలు ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కంటే ముందే పడగ విప్పాయి. కలుపు రాదని.. భారీ దిగుబడులు ఆశచూపుతూ రైతులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. కొందరు దుకాణదారులు, రైతులనే ఏజంట్లుగా ఏర్పాటు
చేసుకుని వారిద్వారానే నకిలీ విత్తనాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యేటా నకిలీ విత్తనాల భారీన పడి రైతులు నష్టపోతున్నా అధికార యంత్రాంగం విూనమేషాలు లెక్కిస్తోంది. ఇటీవల మంచిర్యాల జిల్లాలో కోటి విలువ చేసే 30క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఓ ఎరువుల దుకాణ యజమానే గుజరాత్ నుంచి వాటిని తెప్పించి నిల్వ చేసుకున్నారు. దుకాణదారుడిపైన రామకృష్ణాపూర్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. అంత పెద్దమొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు లభించాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించు కోవచ్చు. ఇలా జిల్లాలో అనేక ప్రాంతాల్లో నకిలీ విత్తన విక్రేతలపై కేసులు నమోదయ్యాయి. నకిలీ విత్తనాలు విక్రయిస్తూ అనేకమంది దొరికిపోయారు. కొందరు దళారులు ఏజంట్ల ద్వారా భారీగా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది. వరుసగా మూడేళ్లుగా ఖరీఫ్ సీజన్ కంటే ముందే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాలకు వీటిని తరలించి రైతులకు అంటగడుతున్నారు. ఈ ఏడాది సీజన్ కంటే ముందే మంచిర్యాల జిల్లాలో భారీగా నకిలీ పత్తివిత్తనాల వ్యవహారం బయటపడటం అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విత్తన కొనుగోళ్ల
విషయంలో రైతుల వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పరిహారం పొందలేకపోయారు.
,…………………………