నగదు బదిలీతో అవినీతి నిర్మూలన

ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధిస్తాం : ప్రధాని మన్మోహన్‌
గ్రేటర్‌ నోయిడా, మే 4 (జనంసాక్షి):12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఎనిమిది శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ వెల్లడించారు. భారత్‌లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శనివారం గ్రేటర్‌ నోయిడాలో ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 46వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ప్రధాని ప్రారంభించి ప్రసంగించారు. స్వదేశి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌళిక వసతుల రంగంలోని ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత మందగమనాన్ని అధిగమించేందుకు, అధిక వృద్ధి రేటు సాధించేందుకు ప్రభుత్వం      తన వంతు కృషి చేస్తుందని ప్రధాని హావిూ ఇచ్చారు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో 8 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంవిధించుకున్నామని, దాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధి రేటు పెరుగుదలకు తగిన కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే వివిధ రంగాల్లో వెచ్చించేందుకు రూ.1000 కోట్ల మేర నిధులు విడుదలకు క్యాబినెట్‌ కమిటీ అనుమతించిందన్నారు. ప్రజలకు విద్య, ఆహారం, సమాచార హక్కు చట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆహార భద్రతా బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో ఉందని, త్వరలోనే చట్టబద్దత కల్పిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతిని రూపుమాపేందుకు నగదు బదిలీ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుడికే చేరుతుందన్నారు. నగదు బదిలీ వల్ల అవినీతి నిర్మూలనతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థలో వృథా తగ్గిపోతుందని చెప్పారు.