నగదు విత్‌డ్రాకు ఇబ్బందులు లేవు
రైతులు నేరుగా బ్యాంకులకు వెళ్లేలా ఏర్పాట్లు: కలెక్టర్
ఆదిలాబాద్,మే23(జనం సాక్షి): చెక్కులు అందుకున్న రైతులు నగదు డ్రా చేసుకునే విదంగా బ్యాంకుల్లో ఏర్పాట్లు చేయించామని, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అసవరం లేదని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. చెక్కులు మూడు నెలల పాటు పని చేస్తుందని చెప్పారు. ఈనెల 28 వరకూ బ్యాంకుల వద్ద నగదును ఉప సంహరించుకోవచ్చని తెలిపారు.నగదు కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. బ్యాంకుల వద్ద రైతుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు సూచించిన తేదీల ప్రకారం బ్యాంకులకు వచ్చి నగదును ఉప సంహరించుకోవాలని సూచించారు. వివిధ కారణాలతో పట్టాపాస్ పుస్తకం, రైతు బంధు చెక్కులు తీసుకొని రైతులు ఈనెల 24నుంచి ఆయా మండలాల్లోని తహసీల్ కార్యాలయాల వద్దకు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5గంటల మధ్య తీసుకోవచ్చని అన్నారు. చెక్కులు, పాస్‌పుస్తకాలు ముద్రణ అనంతరం చనిపోయిన వారి ఇండ్లకు రెవెన్యూ అధికారులు వెళ్లి గుర్తించి అందజేస్తారన్నారు. ఆధార్ నంబర్, ఇతర కారణాలతో కొంత మందికి చెక్కులు, పాస్‌పుస్తకాల ముద్రణ కాలేదన్నారు. వీటిని పార్ట్(బి) కింద తీసుకొని జూన్ మూడు నుంచి సరి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలకు చెక్కుల పంపిణీ కోసం స్లిప్పులు అందించామని చెప్పారు. రైతులు చెక్కులు తీసుకోడానికి పట్టాపాస్ పుస్తకం జిరాక్స్ కాపీ, ఆధార్ జిరాక్స్‌లను వెంట తీసుకురావాలన్నారు. ఫోన్‌నంబర్, అకౌంట్ నంబర్‌ను సైతం తీసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇదిలావుంటే అన్ని శాఖల సమన్వయంతో రైతుబంధు పథకం విజయవంతం అయ్యిందని కలెక్టర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో ఇకముందు కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుని వెళ్లాలని సూచించారు. ఈనెల 10న ప్రారంభమైన రైతుబంధు చెక్కులు, పట్టా పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం 17వ తేదీ వరకూ కొనసాగిందన్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఉన్న 509 గ్రామాల్లో పంపిణీ చేశామని చెప్పారు. రైతుబంధు చెక్కుల ద్వారా రూ.6.96 కోట్లు వచ్చాయన్నారు. 16 మండలాల్లోని 189 రెవెన్యూ గ్రామాల్లో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.