నగరంలో శాంతించిన వరుణుడు

పలు జిల్లాల్లోనూ తగ్గిన వర్షాలు
వర్షాలతో మరోమారు ప్రాజెక్టులకు జలకళ
హైదారబాద్‌ జంట జలాశయాలకు భారీగా వరద
ఉప్పొంగుతున్న మూసీ నది గేట్లు ఎత్తివేత
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి

హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): జంటనగరాలను ముంచెత్తిన వర్షం శనివారం కొచెం తెరిపిచ్చింది. శుక్రవారం ఏకధాటిగా కురిసిన వానకు జంటనగరాలు తడిసి ముద్దయ్యాయి. అలాగే రాష్ట్రంలోనూ కొంత
ఊరట కలిగించేలా వర్షాల జోరు తగ్గింది. వర్షాల కారణంగా భాగ్యనగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే మూసీ పొంగి ప్రవహిస్తోంది. ఇకపోతే భద్రాచలం వద్ద మరోమారు వరద ఉధృతి పెరిగింది. పలు జిల్లాలో వాగులు పొంగుతున్నాయి. ఉస్మాన్‌సాగర్‌ ఇన్‌ప్లో 2000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్‌ సాగర్‌ నాలుగు గేట్లను ఎత్తి 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 1786.65 అడుగులకు చేరింది. అటు హిమాయత్‌ సాగర్‌ కు 500 క్యూసెక్కుల ఇన్‌ప్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు హిమాయత్‌ సాగర్‌ రెండు గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను… ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులకు చేరింది. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,764.52 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 12,099 .18 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ఇప్పుడు 3.33 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉన్నది. కాగా, భారీ వరదతో అనంతారం వద్ద మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. నదిలో 230.5 విూటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. వదర ఉధృతి ప్రమాదకర స్థితిలో ఉన్నదని కేంద్ర జలసంఘం హెచ్చరిం చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాదాద్రి జిల్లాలోని భీమలింగం లో లోలెవల్‌ బ్రిడ్జిపై నుంచి మూసీనది పారుతున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వానలు దంచికొట్టాయి. శివ్వంపేట మండలంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. భారీ వానతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కుంటలు, చెరువులు అలుగు పారుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వార్షం ధాటికి శివ్వంపేటలో రామాలయం ప్రహరీ గోడ, పురాతన బురుజు గోడ కూలిపోయాయి. మాసాయిపేట మండలంలో హల్దీ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వెల్దుర్తి చెరువు మత్తడి పారుతున్నది. మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో అతిభారీ వర్షాలు కురిసాయి. గడిచిన 24 గంటల్లో మెదక్‌ మండలంలో 26.8 సెంటివిూటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. శివ్వంపేట మండలంలో 21.4 సెంటివిూటర్లు, తుప్రాన్‌ మండలంలో 19.6 సెంటీవిూటర్లు, చిన్న శంకరం పేటలో 19.4 సెంటీవిూటర్లు, వెల్దుర్తి లో 17.3 సెంటీ విూటర్లు, నర్సాపూర్‌లో 17.2 సెంటి విూటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అటు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 21.4 సెంటీవిూటర్లు, ఆందోల్‌లో 15.4 సెంటీవిూటర్లు మేర వర్షపాతం నమోదు అయ్యింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌ మండలం కౌలస్‌ నాలా ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 458 విూటర్లు కాగా ప్రస్తుతం 457.90విూటర్లకు చేరింది. అలాగే ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 1.237 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 1.225. టీఎంసీల నిల్వ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌కు 26,794 క్యూసెక్కుల ఇన్‌ ప్లో వచ్చి చేరుతుండగా… ఔట్‌ ప్లో 27,520 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్‌ నీరు భారీగా వెళ్తుండడంతో జుక్కల్‌, బిచ్కుంద, పెద్ద కొడప్‌ గల్‌ మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండంతో గోదావరిలో క్రమంగా వరద అధికమవుతున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదవారి నీటిమట్టం 45.90 అడుగులకు చేరింది. నదిలో 10,48,826 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఉదయం 8 గంటల సమయంలో గోదవారి నీటిమట్టం
45.60 అడుగుల వద్ద ఉండగా, 10,36,818 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. గతవారం గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో నది ఉధృతంగా ప్రవహించిన విషయం తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం రికార్డుస్థాయికి చేరింది. నదిలో వరద ఇంకా తగ్గకపోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరు ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. దీంతో అధికారులు 25 గేట్లు ఎత్తి 1.99 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇల్లందు సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోయగూడెంలో 5.6 సెంటీవిూట్ల వర్షపాతం నమోదయింది. దీంతో ఉపరితల గనిలో రాత్రి నుంచి బొగ్గు ఉత్పతి ఆగిపోయింది.