నడి రోడ్డుపై విషసర్పాలు 

– భయాందోళన చెందుతున్న మంగళూరు వాసులు
బెంగళూరు, మే31(జ‌నం సాక్షి) : మంగళూరు రోడ్లపై ప్రమాదకరమైన జంతువులు దర్శనమిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కర్ణాటకలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వీధులు నీటితో నిండిపోయాయి. దీంతో జనావాసాలకు దూరంగా ఉండాల్సిన పాములు, షార్క్‌లు రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. వర్షాల కారణంగా అరేబియన్‌ సముద్రంలో భారీ అలలు ఎగసిపడటంతో సముద్రపు నీటితో పాటు ఆరు అడుగుల పొడవైన షార్క్‌ ఒకటి మంగళూరు వీధుల్లోకి వచ్చి పడింది. ఇది గమనించిన ఓ వ్యక్తి దాన్ని ఇనుప కొక్కెంతో రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లటంతో అది ప్రాణాలు విడిచింది. అంతేకాకుండా 5 అడుగుల పాము ఒకటి రోడ్డుపై నిల్వ ఉన్న నీటిలో అలా ఈదుకుంటూ వెళ్లటం అక్కడి వారిని కొంత భయానికి గురిచేసింది. పాము తమ పక్కనుంచి వెళ్లేంత వరకూ అలా చూస్తూ ఉండి పోయారు. విషపూరిత జంతువులు నీటిలో తిరుగుతుండటంతో జనాలు వీధుల్లో నిల్వ ఉన్న నీటిలోకి దిగి నడవటానికి భయపడతున్నారు. సముద్రంలో భారీ అలలు ఎగసి పడుతుండటంతో జాలర్లు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. కర్నాటక బెళ్తంగడి తాలూకా మిత్తబాగిలులోని ఎర్మయ్‌ ఫాల్స్‌లో షూటింగ్‌ కోసం వెళ్లిన కన్నడ వర్ధమాన దర్శకుడు సంతోష్‌ శెట్టి అధిక వర్షాల కారణంగా నీటి ఉధృతిలో కోట్టుకొనిపోయి మరణించిన విషయం తెలిసిందే.