నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

 *ఇటిక్యాల ఎస్ఐ గోకారి*
 ఇటిక్యాల జులై 12 (జనంసాక్షి) గత కొద్ది రోజులనుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటిక్యాల ఎస్సై గోకారి అన్నారు. మంగళవారం అలంపూర్ వలయాధికారి సూర్య నాయక్ ఆదేశాల మేరకు మంగళవారం మండల పరిధిలోని బీచుపల్లి, కొండపేట, యాక్తాపురం, తిమ్మాపురం గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచుల ఆధ్వర్యంలో మత్స్యకారులకు, ప్రజలకు వర్షాల కారణంగా జరిగే ప్రమాదాల పై  అవగాహన కల్పించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదల కారణంగా కృష్ణ, తుంగభద్ర నదులకు జల ప్రవాహం పెరుగుతుండడంతో నది ప్రవాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలకు విద్యుత్ సమస్యలు, పాడుబడ్డ మట్టి మిద్దెలు తదితర సమస్యలుంటే గ్రామ సర్పంచ్ లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. అలాగే అత్యవసర పరిస్థితులలో పోలీసులు సహాయం కోసం 100  హెల్ప్ లైన్లను సంప్రదించాలన్నారు. బీచుపల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, పర్యాటకులు కూడా జాలర్ల, పోలీసుల సూచన మేరకు నదిలోకి వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ప్రవీణ్, వర్ధరాజు, పోలీస్ సిబ్బంది, గజతగాళ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.