నమ్మిన దేవుడే అత్యాచారం చేశాడు

– విషయం తెలిసి గుండెలు అవిసేలా ఏడ్చాం
– దేవుడితో పోరాడగలమా? అనుకున్నాం
– మా కేసుల్లో సాక్ష్యాదారులను కొంతమందిని చంపించివేశారు
– మొండి ధైర్యంతో తన బిడ్డ, తన భర్త పోరాడారు
– చివరికి అన్ని అవాంతరాలు ఎదుర్కొని విజయం సాధించాం
– ఆశారాంబాపుకు తగిన శిక్ష పడింది
– ఇప్పుడు నా బిడ్డ సంతోషంగా చదువుకుంటుంది
– ఓ ఆంగ్ల ఛానెల్‌ ఇంట్వ్యూలో బాధితురాలి తల్లి స్పందన
షజహాన్‌పూర్‌, మే29(జ‌నం సాక్షి) : ఆశారాంబాపు మా దేవుడు, మా జీవితాలు ఆయన చుట్టూనే తిరుగుతాయి.. ఒక్కరోజులో ఆదేవుడు మా జీవితాలను నాశనం చేశాడు.. 16ఏళ్ల నా కూతురుపై హత్యాచారం చేశాడు.. విషయం తెలిసి ఏం చేయాలో తెలియలేదు.. గుండెలు అవిసేలా ఏడ్చాం.. తన భర్త, తన బిడ్డ మొండిధైర్యంతో ఆశారాంకు శిక్షపడేలా చేశారు అంటూ బాధితురాలి తల్లి ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇటర్వ్యూలో పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించారు.. తమ బిడ్డపై హత్యాచారం చేసిన విషయాన్ని నా బిడ్డ వచ్చి చెప్పినప్పుడు ఆ మాటలు జీవితంలో దురదృష్టకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి. నా భర్తతో ఈ విషయం చెప్పినప్పుడు ఆయన కుప్పకూలిపోయారు. ఆయన్ని ఆ విధంగా చూడటం అదే తొలిసారి. ఎందుకంటే తను పుట్టాకే మా వారు చేస్తున్న రవాణా వ్యాపారం లాభాల బాట పట్టింది. అలాంటి కూతురి పట్ల ఇంత దారుణం జరిగిందని తెలిసి ఆయన తల్లడిల్లిపోయారు. ఆ రోజు మా కుటుంబంలో ఎవ్వరికీ తిండి లేదు, నిద్రలేదు. కలలో కూడా ఊహించని ఘటన మా జీవితాల్లో జరిగింది. మేము దైవంగా భావించే ఆశారాం నా బిడ్డపై అత్యాచారం చేశాడు. అలాంటప్పుడు ఓ దేవుడు మా జీవితాలు నాశనం చేశాడని ఎలా ఆరోపించగలం? ఒక దేవుడితో ఏ విధంగా పోరాడగలం? ఈ ఆలోచనలతో నేను సతమతమవుతుంటే నా భర్త మరుసటి రోజు ఆశారాంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆశారాం చేసిన తప్పు గురించి నా బిడ్డ చెప్పిన రోజే నా భర్త ఆయన్ను నిలదీయాలని అనుకున్నారు. కానీ ఆశారాం భక్తులు లోపలికి రానివ్వలేదు. ఆశారాంపై కేసు పెట్టాక అందరూ కేసు వాపసు తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. కానీ మేం ఒప్పుకోలేదు. ‘నాన్నా నువ్వు భయపడకు. నాకు ఏవిూ కాదు’ అని నా కూతురు ధైర్యం చెప్పేది. కన్నీళ్లు ఆపుకొని మాకు అండగా నిలబడింది. కేసుతో పోరాడి గెలిచింది. ఆశారాంను భగవంతుడిగా పూజించే నా భర్తను చూసే మేమూ ఆయన భక్తులమయ్యాం. ఆయనపై ఉన్న నమ్మకంతోనే ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చదువుతున్న నా కొడుకు, కూతురిని ఆశారాం నడుపుతున్న ఆశ్రమంలో చేర్పించాం. ఆశారాం గురించి తప్పుగా ఆరోపణలు చేసేవారితో మేం మాట్లాడేవాళ్లం కాదు. మధ్య తరగతి కుటుంబమే అయినా మా వారు నెలకు సంపాదించే సొమ్ములో కొంత ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేవారు. షాజహాన్‌పూర్‌లో మేం నివసిస్తున్న ఇంటి ఆవరణలోనే ఆశారాం పేరిట చిన్న ఆశ్రమం కూడా కట్టించారు. అంతగా నమ్మిన ఆయనే మా జీవితాలను కుదిపేస్తారని ఊహించలేకపోయాం. మేం ఆయన కోసం ఇంత చేస్తే ఆయన మా గౌరవాన్ని, పరువును లాగేసుకున్నారు. సమాజంలో తలెత్తుకుని తిరగకుండా చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పోరాడాలని అనుకున్నందుకు మమ్మల్ని చంపించాలనుకున్నారు. గత రెండేళ్ల నుంచి నా బిడ్డకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో షాజహాన్‌పూర్‌ నుంచి జోధ్‌పూర్‌కు ప్రయాణాలు
చేశాం. కానీ నా బిడ్డ మాత్రం వెనక్కి తగ్గాలని అనుకోలేదు. న్యాయమూర్తి ఎదుట తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నప్పుడు నా కూతురు నా కళ్లకు హీరోగా కన్పించింది. నా బిడ్డ ధైర్యాన్ని చూసి మా తరఫున వాదించిన న్యాయవాది కూడా ఆశ్చర్యపోయారు. మేం ఈ కేసు విషయంలో బిజీగా ఉండడంతో నా రెండో కూతురు, కుమారుడు చదువు ఆపేసి వ్యాపారాన్ని చూసుకునేవారు. వీటన్నింటికి తోడు ఆశారాం సహచరుల నుంచి వచ్చిన బెదిరింపులు తట్టుకోలేపోయేవాళ్లం. మా కేసులో సాక్ష్యులుగా ఉన్న కొందరిని హత్య చేయించారు కూడా. ఎట్టకేలకు ఆశారాంకు శిక్ష పడింది. మేం చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు సంతోషించాం. ఆ సమయంలో నా కూతురు నన్ను చాలా సేపటి వరకు ఆలింగనం చేసుకుంది. ఇప్పుడు నా కూతురి ముఖంలో నవ్వు చూడగలుగుతున్నాను. అన్నీ మర్చిపోయి చదువుకుంటోంది. బ్యాడ్మింటన్‌, పెయింటింగ్‌ నేర్చుకుంటోంది. సివిల్స్‌కు సన్నద్ధమవుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్ని జన్మలెత్తినా నా కూతురికే తల్లిగా పుట్టాలని ఉంది’ అని చెప్పుకొచ్చారు.