నయీం కేసు ‘సిట్‌’కు అప్పగింత

2

హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి):నయీం కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సర్కారు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ అనురాగ్‌ శర్మ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి ప్రత్యే బృందాన్ని లీడ్‌ చేయనున్నారు. మొత్తం పది మంది పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. నయీం ఆస్తులు, బినావిూలపై ఈ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ దర్యాప్తు చేయనుంది.

నయీమ్‌ అల్కాపురి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకకున్నారు. విచారణ నిమిత్తం అతడిని నల్లగొండకు తరలించారు. నయీమ్‌ అక్రమాలు తవ్విన కొద్దీ వెలుగు చూస్తున్నాయి. నయీమ్‌ అక్రమాస్తుల చిట్టా రోజు రోజుకూ పెరుగుతోంది. నయీం అనుచరులు ఫర్హానా, అఫ్సాను 3 రోజుల పోలీసు కస్టడీకి రాజేంద్రనగర్‌ కోర్టు అనుమతించింది. దీంతో వీరిద్దరినీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కోర్టు అనుమతితో పుప్పాలగూడలోని నయీం నివాసం రెండో అంతస్తులోని గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.  కోర్టు అనుమతితో అల్కాపురిలోని నయీం ఇంట్లో పోలీసులు మళ్లీ సోదాలు నిర్వహించారు. పోలీసులు నయీం బెడ్‌రూమ్‌ను ఓపెన్‌ చేయనున్నారు. ఇప్పటికే  తనిఖీల్లో వేల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇక ఈరోజు జరిగే సోదాలతో మరెన్నో వాస్తవాలు బయటపడతాయో చూడాలి. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఇంట్లో దొరికిన ఆస్తుల చిట్టా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు డ్రైవర్‌ శ్రీధర్‌ గౌడ్‌ ఇంట్లో సోదాలు చేశారు. వనస్థలిపురం సహేత్‌నగర్‌ భవనా ఎన్‌క్లేవ్స్‌లో శ్రీధర్‌ ఇంట్లో రూ.40 లక్షల నగదు, నాలుగు తుపాకులు, పలు ల్యాండ్‌ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు భర్తను కోర్టులో హాజరుపర్చాలంటూ శ్రీధర్‌గౌడ్‌ భార్య హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో శ్రీధర్‌గౌడ్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసును సిట్‌కు బిదిలీ చేసిన నేపథ్యంలో పది బృందాలుగా విడిపోయిన అధికారులు హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్‌ జిల్లా సహా పలు ప్రాంతాల్లో నయీమ్‌ అనుచరుల ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. అటు స్వాధీనం చేసుకున్న ల్యాండ్‌ డాక్యుమెంట్ల ఆధారంగా వాటి యజమానుల వద్దకు వెళ్లి పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌  అధికారు నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అటు నార్సింగ్‌లోని నయీమ్‌ ఇంట్లో పోలీసులు మరోసారి సోదాలు చేస్తున్నారు. సోదాల్లో దొరికిన పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు , హార్డ్‌డిస్కుల్లో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. మరో వైపు హైదరాబాద్‌ శివారులో నయీం అనుచరుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. వస్థలిపురంలో అదుపులోకి తీసుకున్న శ్రీధర్‌గౌడ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో నయీం అనుచరుడు రియాజ్‌ను పోలీసులు పట్టుకున్నారు. రియాజ్‌ను నల్గొండ తరలించి రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.సరూర్‌నగర్‌, మన్సూరాబాద్‌, ఆదిభట్లలో నయీం భూముల వివరాలపై ఆరా తీస్తున్నారు. నగర శివారులో నయీం బినావిూల పేరిట భారీగా భూములున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నయీం డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పలువురు ప్రముఖలపై కూడా పోలీసులు నిఘాపెట్టినట్లు సమాచారం.ఇదిలావుంటే  వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ అలియాస్‌ నయీమ్‌ ముఠాపై బుధవారం మరో ఫిర్యాదు అందింది. మాజీ మావోయిస్టు కోనపురి రాములు హత్యకు సహకరించలేదని తనపై నయీం ముఠా సభ్యులు దాడి చేశారంటూ అతని వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నయీం ముఠా నుంచి ప్రాణహాని ఉందనీ, తనకు రక్షణ కల్పించాలంటూ రాములు డ్రైవర్‌ కిరణ్‌ పోలీసులను ఆశ్రయించాడు. అయితే నయీం ముఠా దాడిలో తాను తృటిలో తప్పించుకున్నానంటూ అతడు పోలీసులకు వివరించాడు. గతంలో తనపై దాడి జరిగిందన్నారు.