నల్లకుబేరుల కోసమే ఫేర్‌ అండ్‌ లవ్‌లీ

5
– కన్హయ్య, రోహిత్‌లపై మోదీ మౌనమేళా?

– రాహుల్‌ ఫైర్‌

న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లోక్‌సభలో తనదైన శైలిలో అధికార పక్షంపై చురకలంటించారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజల కోసం ఫెయిర్‌ అండ్‌ స్కీం ను తీసుకొస్తున్నట్టు మోడీ వెల్లడించారని అన్నారు. అయితే ఈ స్కీం ప్రజల కోసం కాదని..బ్లాక్‌మనీని వైట్‌ మనీగా మార్చేందుకేనని ఆరోపించారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ దేశానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదని రాహుల్‌గాంధీ అన్నారు.  పటియాలా హౌస్‌ కోర్టు వద్ద జరిగిన దాడిపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. హెచ్‌సీయూలో రోహిత్‌ ఆత్మహత్యపైనా ప్రధాని మౌనం వహించారని… కనీసం రోహిత్‌ తల్లితో కూడా మాట్లాడలేదన్నారు. మంత్రుల మాటలను కూడా ప్రధాని పట్టించుకోవడం లేదన్నారు. నాగాలాండ్‌ ఒప్పందం సహచర మంత్రులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా చేసుకోవడం వారిని అవమానించడమేనన్నారు. తీవ్రవాద దాడుల విషయంలో పాకిస్థాన్‌ను యూపీఏ ప్రభుత్వం ఏకాకిని చేసిందన్నారు. పాకిస్థాన్‌ దుర్మార్గాలను ఎండగట్టేందుకు తాము కృషి చేసినట్లు రాహుల్‌ తెలిపారు. రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో పదను పెంచారు. నవ్వుతూనే వ్యంగ్యాస్త్రాలు వేశారు. పదునైన విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వంపై చురకలు వేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన లోకసభలో మాట్లాడుతూ దూకుడు స్టయిల్‌లో మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ చేసిన వాగ్ధానాలను రాహుల్‌ తన ప్రసంగంలో ప్రశ్నించారు. ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ? మరి మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో వెల్లడించాలని ప్రశ్నించారు. నల్లధనం వెలికి తీస్తామనన్నారు. కానీ ఇప్పటివరకు ఏవిూజరగలేదన్నారు. ఫెయిర్‌ అండ్‌ లవ్లీ తరహాలో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని ప్రభుత్వం అంటోంది, మోదీ వచ్చిన తర్వాతే పప్పు దినసుల ధర రూ.200 దాటిందన్నారు. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తిని కాదని, తప్పులు చేస్తానని రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యపై రాహుల్‌ మాట్లాడారు. రోహిత్‌ దళితుడా ? కాదా ? ఇది ప్రశ్న కాదు. ఓ భారతీయ విద్యార్థికి ఎందుకు ఇలా జరిగింది. రోహిత్‌ తల్లితో మోదీ ఇంతవరకు మాట్లాడలేదని రాహుల్‌ విమర్శించారు. జేఎన్‌యూలో కన్నయ్యపై అక్రమంగా కేసు పెట్టారన్నారు. కన్నయ్య 20 నిమిషాలు మాట్లాడిన వీడియోను చూశానని, అందులో దేశవ్యతిరేక కామెంట్‌ ఏవిూలేదన్నారు. మరెందుకు కన్నయ్యను అరెస్టు చేశారో చెప్పాలన్నారు. జేఎన్‌యూలో ఉన్న విద్యార్థుల్లో 60 శాతం మంది దళిత, వెనుకబడిన విద్యార్థులే ఉంటారన్నారు. ప్రధాని మోదీ తన స్వంత అభిప్రాయాల మేరకు దేశాన్ని నడపలేరన్నారు. కేంద్ర మంత్రుల సూచనలను ప్రధాని స్వీకరిస్తున్నారా లేదా చెప్పాలన్నారు. దేశం అంటే ప్రధాని కాదు, ప్రధాని అంటే దేశంకాదన్నారు. ఏబీబీపీ కార్యకర్తలు తన ముఖం ముందే అసభ్యంగా మాట్లారని రాహుల్‌ గుర్తు చేశారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై రాహుల్‌ మరింతగా ఫైరయ్యారు. మోదీ ఆకస్మికంగా పాకిస్థాన్‌ పర్యటించడాన్ని రాహుల్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ముంబై దాడుల కేసులో పాకిస్థాన్‌ పాత్రను బట్టబయలు చేసేందుకు కొన్ని ఏళ్లు పట్టిందని, దాన్ని ప్రధాని మోదీ ఛాయ్‌ పే చర్చాతో భ్రష్టుపట్టించారన్నారు. తాము పడ్డ ఆరేళ్ల శ్రమను ప్రధాని మోదీ ఒక్కరే బలహీనపరిచారని ఆరోపించారు. మోదీ ఆకస్మికంగా పాకిస్థాన్‌కు వెళ్లి దేశ ప్రజలను, సమర్థనీయులైన అధికారులను అగౌరవపరిచారని రాహుల్‌ విమర్శించారు. సీనియర్‌ మంత్రులు రాజ్‌నాథ్‌, జైట్లీ, సుష్మా సూచనలను మోదీ స్వీకరించాలని సూచించారు. ఒక ఆలోచన, విజన్‌ లేకుండా మోదీ ఎందుకు పాక్‌ వెళ్లారని రాహుల్‌ ప్రశ్నించారు. నాగాలాండ్‌ ఒప్పందంపై ప్రధాని సంతకం చేసిన విషయం కేంద్ర మంత్రులకు కూడా తెలియదన్నారు.