నల్లధనం తెస్తామన్నారేమైంది?

2

ప్రతి సామాన్యుని ఖాతాలోకి 15 లక్షలన్నారు, 15 రూపాయలు రాలేదు

భూ సేకరణ చట్టానికి తూట్లు పొడిచారు

నరేంద్ర మోదీ పాలనపై సోనియా ఫైర్‌

దిల్లీ, ఫిబ్రవరి1,(జనంసాక్షి): నల్లధనం తెస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మోదీ ఆ దిశగా ఏమీ చేయలేదని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ధ్వజమెత్తారు. సామాన్యులు బ్యాంకు ఖాతాల్లో 15 లక్షల రూపాయలు తెస్తామన్న మోదీ ప్రభుత్వం ఇప్పటిదాక 15 రూపాయలు కూడా తీసుకు రాలేకపోయిందన్నారు. తాము పేదల సంక్షేమమే ధ్యేయంగా భూసేకరణ చట్టం తీసుకొస్తే దానికీ తూట్లు పొడితారని విమర్శించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇరువురిపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీని ‘ప్రచారక్‌’గా, కేజ్రీవాల్‌ను ధర్నాలవీరుడుగా అభివర్ణించారు. ప్రస్తుత దిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమె తొలిసారిగా పార్టీ తరఫÛన ఆదివారం ప్రచారం నిర్వహించారు. దక్షిణ దిల్లీలోని మీఠాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. డొల్ల హామీలు ఇచ్చేవారి బారి నుంచి దిల్లీని రక్షించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ”ఒక పార్టీకి ‘ప్రచారక్‌’ ఉన్నారు. ఆయన కేవలం ప్రచారమే చేస్తారు. ఇంకో పార్టీకి ధర్నాల వీరుడు ఉన్నారు. ఆయన ఎప్పుడూ ధర్నాల్లోనే నిమగ్నమవుతారు. దిల్లీకి సుపరిపాలన కావాలి. తప్పుడు హామీలు కాదు. భాజపా, ఆప్‌లు డొల్ల హామీలు ఇస్తున్నాయి” అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేయాలని ప్రజలను సోనియా కోరారు. ”నినాదాల ద్వారా దేశాన్ని ముందుకు నడిపించలేం. పోరాటం, నిబద్ధత ద్వారానే అభివృద్ధి సాధ్యం. అది కాంగ్రెస్‌ మాత్రమే సాధించగలదు” అని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ సర్కారు డొల్ల హామీలు ఇచ్చిందని విమర్శించారు. ”ఎన్నికలకు ముందు భాజపా భారీగా హామీలు ఇచ్చింది. నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామన్నారు. ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామన్నారు. ప్రతి భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయడానికి ఆస్కారం కల్పించే ఆ నల్లధనం ఎక్కడ? ఉపాధి ఏదీ? ద్రవ్యోల్బణాన్ని తగ్గించే చర్యలేవీ” అని ప్రశ్నించారు. భూసేకరణ బిల్లులో మార్పులు చేయడం ద్వారా మోదీ సర్కారు దిల్లీ ప్రజలను మోసం చేసిందని సోనియా విమర్శించారు. ”పేదలకు సాధికారత కల్పించే అనేక చర్యలను యూపీఏ హయాంలో తెచ్చాం. పేదల నుంచి అధికారాన్ని లాగేసుకోవడం కోసం మోదీ ప్రభుత్వం వాటిని బలహీన పరుస్తోంది. తప్పుడు పద్ధతుల్లో ప్రజల నుంచి భూమిని సేకరించకుండా భూసేకరణ చట్టాన్ని తెచ్చాం. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ వల్ల చట్టం బలహీనమవుతోంది. రైతుల నుంచి భూమిని లాగేసుకోవడానికి డెవలపర్లకు అది వీలు కల్పిస్తుంది. ఆహార భద్రత చట్టంలో మార్పులు చేయడం ద్వారా లబ్ధిదారుల శాతాన్ని 67 నుంచి 40కు తగ్గించడానికి ప్రయత్నిస్తోంది” అని విమర్శించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందడంలేదన్నారు. వారికి గిట్టుబాటు ధర దక్కడమూ అనుమానమేనని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం కోసం తాము తీవ్రంగా కృషి చేశామని చెప్పారు. ”ఇప్పుడు అవినీతి రహిత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నవారు సీఐసీ పదవిని ఖాళీగా ఉంచారు. అవినీతిపరులకు స్వేచ్ఛనిచ్చారు” అని విమర్శించారు. దిల్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ముందు ఇక్కడ మత హింస చోటుచేసుకుందని చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికే అలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్వేష రాజకీయాలను వ్యాప్తి చేసేవారిని ఓడించాలన్నారు.ఆప్‌పైనా సోనియా నిప్పులు కురిపించారు. ”ఆ పార్టీకి మేం మద్దతు ప్రకటించాం. అయితే రాష్గాన్ని నెలన్నర కూడా పాలించలేకపోయింది. బాధ్యతల నుంచి వారు పరారయ్యారు” అని వ్యాఖ్యానించారు. దిల్లీలో ప్రస్తుత స్థితికి భాజపా, ఆప్‌లే కారణమని విమర్శించారు. ”ఒక పార్టీ తన బాధ్యతల నుంచి పారిపోయింది. మరోపార్టీ.. ఎన్నికలను జాప్యం చేస్తూ రాష్ట్రపతి పాలన పేరుతో సొంత పాలన సాగించింది” అని మండిపడ్డారు.