నవంబర్‌ 1 విద్రోహదినం -జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైద్రాబాద్‌, అక్టోబర్‌ 30 (జనంసాక్షి): నవంబర్‌1 తెలంగాణ విద్రోహదినంగా పాటించాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని తెలంగాణలోని ప్రజలంతా బహిష్కరించాలన్నారు. తెలంగాణ అంతటా నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలని, ఆ రోజు హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యోగులెవరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తెలంగాణకు శాపంగా మారిందన్నారు. ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా టీఆర్‌ఎస్‌ తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. అదే రోజున తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి తెలపాల్సిందిగా కోరారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఏకం చేస్తూ 1956 నవంబర్‌ ఒకటిన ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని, సమైక్యాంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి అన్ని విధాలా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. నవంబర్‌ ఒకటవ తేదీని విద్రోహదినంగా పరిగణిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.