నవంబర్ 1 విద్రోహ దినం
తెలంగాణ మంత్రులు వేడుకల్లో పాల్గొనవద్దు
ఉద్యమ తీవ్రతతోటే ప్రధాని గాలిమార్గంలో పోయిండు
కేంద్రం మాట నిలబెట్టుకోవాలె .. తెలంగాణ ప్రకటించాలె
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్, అక్టోబర్ 16 (జనంసాక్షి) :
తెలంగాణపై కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం
చేశారు. కేంద్రం సీమాంధ్రుల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, అందుకే తెలంగాణ ఇచ్చేందుకు వెనుకాడుతోందన్నారు. తెలంగాణపై కేంద్ర వైఖరిని, హైదరాబాద్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్ రాకను నిరసిస్తూ.. తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఐక్య దీక్ష చేపట్టారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ నేతలతో పాటు పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతర నేతలు హాజరయ్యారు. వారంతా నల్లబ్యాడ్జీలు, చొక్కాలు ధరించి దీక్షలో కూర్చున్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం విశ్వాసఘాతుకానికి పాల్పిందని మండిపడ్డారు. ఈ అంశంపై కేంద్ర నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్‌తో ఓ మాట, బయట మరోమాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేల విడిచి సాము చేస్తోందని విమర్శించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు తెలంగాణ ఉద్యమ తీవ్రత అర్థమైందని, అందుకే జీవ వైవిధ్య సదస్సుకు హెలికాప్టర్‌లో రావడమే ఇందుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రధాని కనీసం మంత్రులను కూడా కలవకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలను కూడా ప్రధాని గుర్తించాలని డిమాండ్ చేశారు. నవంబర్ 1వ తేదీని తాము తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సంపన్న వర్గాల చేతుల్లో చిక్కుకుందని కోదండరాం మండిపడ్డారు. అందుకే తెలంగాణపై ఇచ్చిన హావిూని నిలబెట్టుకోలేక పోతోందని విమర్శించారు. మరో మూడ్రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం తుది దశకు చేరిందన్నారు. ఉద్యమ తీవ్రత కారణంగా ప్రధాని హెలికాప్టర్‌లో వెళ్తున్నారంటే.. మర పోరాట పటిమ ఎలా ఉందో ప్రపంచం మొత్తాని అర్థమవుతుందన్నారు. డిసెంబర్ 9 నాటి ప్రకటనకు కట్టుబడి తక్షణమే తెలంగాణను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: నాగం
తెలంగాణ ప్రజల ఆత్మబలిదానాలన్నీ ప్రభుత్వ హత్యలేనని నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సమస్య.. సమస్యలా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలోని ఆత్మబలిదానాలన్నింటికీ కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, ఆజాద్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నక్సల్స్ సమస్య అని ఒకరంటారని, ఏకాభిప్రాయం కావాలని మరొకరంటారని ధ్వజమెత్తారు. నక్సల్స్ సమస్య ఒక్క తెలంగాణ ప్రాంత సమస్యే కాదని.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అని తేల్చిచెప్పారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దని హెచ్చరించారు. తెలంగాణపై తేల్చకుండా.. ఆ పండుగ, ఈ పండుగ అంటూ కేంద్రం మభ్యపెడుతోందని నాగం విమర్శించారు. పండుగ తర్వాత పండుగ ఎట్లాయినా వస్తదని, అట్లని చెప్పి తెలంగాణ అంశాన్ని దాటవేయడం సరికాదన్నారు. మంత్‌ఉలకు అన్ని సమస్యలుంటాయని, వారు అన్ని సమస్యలు పట్టించుకుంటారు కానీ, తెలంగాణ సమస్యనెందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. తెలంగాణ సమస్య.. సమస్య కాదా? అని నిలదీశారు. తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ బిల్లు పెట్టించాలని, బిల్లు దానంతటదే ఆమోదం పొందుతున్నారన్నారు.
తెలంగాణ అని ఎవరన్నా.. టీఆర్‌ఎస్‌కే ఓట్లు: కేకే
తెలంగాణ ఏర్పాటు కోసం అన్ని పద్ధతుల్లో పోరాడుతున్నా.. రాష్ట్రం రావాలంటే తల ఎక్కడ బద్దలు కొట్టుకోవాలో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు అన్నారు. పార్లమెంట్‌లో పది ఎంపీలు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేసినా ప్రభావం చూపలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 22 మంది కాంగ్రెస్ అసెంబ్లీకి వెళ్లమని, రాజీనామా చేసి ఒక్క కాగితం ఇస్తే.. తెలంగాణ వస్తుందన్నారు. కేంద్ర మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకే అలా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. రెండో ఎస్సార్సీ అని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అనడం సరికాదన్నారు.
తెలంగాణ ప్రజలందరిలో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న కోరిక ఉందని కేకే అన్నారు. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, అందరి ఆశయం తెలంగాణెళినని చెప్పారు. తెలంగాణపై అసెంబ్లీలో ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. తీర్మానం పెడితేనే సభకు వస్తామని భీష్మించుకు కూర్చుంటే, కేంద్రం దిగివస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం లేనట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ అని ఎవరన్నా.. ఓట్లు మాత్రం టీఆర్‌ఎస్‌కే పడతాయని కుండబద్దలు కొట్టారు. అలాంటి టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరినీ కలుపుకుపోవాలని సూచిచంఆరుఉ. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెంత అడ్డు తగిలినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తీరుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేయాలని, తక్షణమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ఉద్యోగ సంఘాల నేతలు దేవిప్రసాద్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్ తదితర నేతలు కూడా దీక్షలో పాల్గొన్నారు.