నవరత్నాల పేరుతో వైసిపి నవమోసాలు


పేదల బియ్యానికి ఎసరు పెట్టారన్న బోండా ఉమ
లోకేశ్‌ తప్పేం మాట్లాడారన్న ఎమ్మెల్సీ మంతెన
అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): పేదలకు నవరత్నాలు అని చెప్పి వైసీపీ నవ మోసాలు చేసిందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. ఈకేవైసీ ఉంటేనే బియ్యం ఇస్తామని పేదవాళ్ళను ముప్పు తిప్పలు పెడుతున్నారన్నారు. వేలి ముద్రలు మళ్లీ వేస్తేనే బియ్యం ఇస్తామని రేషన్‌ ఎగ్గొడుతున్నారన్నారు. రాష్ట్రంలో పేదలందరూ ఆధార్‌ సెంటర్ల వద్దే ఉన్నారన్నారు. కాపు మహిళలకు కాపు నేస్తం అందరికీ ఇస్తామని… 25 శాతం మంది మహళలకే ఇచ్చారని బోండా ఉమ పేర్కొన్నారు. ఇదిలావుంటే ఉజ్వల భవిష్యత్‌ ఉన్న దళిత యువతి దారుణ హత్యకు గురైందని రాష్ట్రమంతా బాధపడుతుంటే..మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కొడాలి నాని మాత్రం జగన్‌ని లోకేష్‌ ఏదో అన్నాడని బాధపడటం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ వైసీపీ వైఖరితో రమ్య ఆత్మ ఘోషిస్తుందన్నారు. దళిత యువతి కుటుంబానికి అన్యాయం జరిగితే నోరుమెదపని వైసీపీ నేతలు? ముఖ్యమంత్రి జగన్‌ని లోకేశ్‌ విమర్శించారని బయటకొచ్చి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మంత్రి పదవులు పోకుండా కాపాడుకునేందుకు కొడాలి నాని, అవంతి తమ నోళ్లు పారేసుకుంటున్నారని విమర్శించారు. ఒలంపిక్స్‌లో బూతుల పోటీలు పెడితే కాంస్యం కొడాలి నానికి, రజతం అవంతి శ్రీనివాస్‌లకే వస్తుందని యెద్దేవా చేశారు. లోకేష్‌ మాట్లాడిన దానిలో తప్పేంటో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై మహిళలపై హత్యలు, దాడులు జరుగుతున్నాయంటే తమ ప్రభుత్వ అసమర్ధ, వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోగా.. న్యాయం చేయమని కోరిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని…రమ్య కుటుంబానికి రూ.1 కోటి ఇవ్వాలని మంతెన సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.