నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

తొమ్మిది మంది దుర్మరణం

 హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అపార్టుమెంటు ముందు పార్క్‌ చేసి ఉన్న కార్లు, ద్విచక్రవాహనాలు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఫైర్‌ సిబ్బంది నాలుగు ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. అపార్టుమెంటులోని 15 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. కొంతమందికి దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.అపార్టుమెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఓ గ్యారేజీ ఉన్నదని, ఆ గ్యారేజీలో కారును రిపేర్‌ చేస్తుండగా మంటలు చెలరేగాయని స్థానిక డీసీపీ తెలిపారు. గ్యారేజీలోనే డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకుని అపార్టుమెంటు పైఅంతస్థులకు ఆ మంటలు చెలరేగాయని, అపార్టుమెంటు మూడు, నాలుగో ఫ్లోర్‌లలో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని చెప్పారు.ఈ ప్రమాద ఘటనపై డీసీపీ మాట్లాడుతూ.. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి అపార్ట్‌మెంట్‌పైకి మంటలు వ్యాపించాయి. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో మెకానిక్‌ షెడ్‌ ఉంది. కారు రిపేర్‌ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డీజిల్‌ డ్రమ్స్‌ పేలడంతో మంటలు వ్యాపించాయి.