నాంపల్లి అగ్నిప్రమాదంపై కేటీఆర్ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పూర్తిస్థాయి దర్యాపునకు ఆదేశించారు. నాంపల్లిలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి కేటీఆర్ అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనపై మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.మృతులకు సంతాపం తెలిపి.. బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తామన్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆరు నెలల కింద అగ్ని ప్రమాదాలపై సేఫ్టీ ఆడిట్ కింద ఎంక్వైరీ చేయించామని.. ఇప్పుడేం జరిగిందో నివేదిక ద్వారా తెలుసుకుంటామన్నారు.