నాకు కోపమొస్తే మరిన్ని పథకాలు ప్రవేశపెడతా

నేనసలే మొండోన్ని
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌, మార్చి 12 (జనంసాక్షి):
రెవెన్యూ సదస్సుల్లో వచ్చే పిటిషన్లను 90రోజుల్లోగా పరిష్కరిస్తా మని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ధన్వాడలో మంగళవారం మధ్యాహ్నం రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. గత రెవెన్యూ సదస్సుల్లో 6,90,000 పిటిషన్లు రాగా.. నిన్నటి వరకు 6,86,000 పిటిషన్లు పరిష్కరించామన్నారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పరిష్క రిస్తామన్నారు. గ్రామీణులకు మేలు చేకూర్చేందుకే రెవెన్యూ సదస్సుల లక్ష్యమన్నారు. ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలను, రైతులను కోరుతున్నానన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు తిరుగుతూ ఆయా ప్రాంతాల్లోని స్థానికుల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు రెండో విడత చేపట్టామని అన్నారు. టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావుకి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని విమర్శించారు. ఎంపీగా ఉండి జిల్లాలో ఆయన ఎన్నిసార్లు పర్యటించాడో.. ముఖ్య మంత్రిగా తానెన్నిసార్లు వచ్చానో ప్రజలే బేరీజు వేసుకోవాలన్నారు. కెసిఆర్‌, వైఎస్‌ఆర్‌సిపి కలిసి ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. తాను మొండివాడ్ని అని.. తనకు అడ్డొస్తే మరింత గట్టిగా పధకాలను అమలు చేస్తానని, ప్రజల అండ ఉన్నంత కాలం తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదన్నారు. వైఎస్‌ఆర్‌సిపి, టిఆర్‌ఎస్‌, తదితరులు కలిసి అవిశ్వాసం పెట్టినా.. ఎదుర్కొంటామన్నారు. తమ పార్టీ సత్తాను మరోసారి చాటుతామని అన్నారు. తాము ఎవరికీ భయపడబోమన్నారు. ప్రజల సహకారంతో మరింత ముందుకు సాగుతామన్నారు. వచ్చే అయిదేళ్ల వరకు తమ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలు అని అన్నారు. జలయజ్ఞం ద్వారా మరో 10 లక్షల ఎకరాలను సాగులోకి తేనున్నట్టు చెప్పారు. ఇప్పటికే పలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నెట్టెంపాడు-2 సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే జిల్లాలో ఎడ్యుకేషనల్‌ ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. విద్యారంగంలోను జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు ఇప్పటికే అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. అది త్వరలోనే కార్యరూపం దాల్చనున్నదన్నారు. సహకార ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానన్నారు. త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లోను, మునిసిపల్‌ ఎన్నికల్లోను ప్రజలు తమనే గెలిపిస్తారని, అందులో ఏ మాత్రం అనుమానం లేదని అన్నారు. మీ సేవా ద్వారా ఇప్పటికే 42 సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. గ్రామస్థాయి, కలెక్టర్‌ స్థాయి, రాష్ట్ర స్థాయికి సంబంధించిన సేవలన్నింటిని మీ సేవా ద్వారా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారన్నారు. ఆ ప్రక్రియ కొలిక్కి వస్తే మొత్తం 170 సేవలు అతి చౌకగా.. అతి తక్కువ కాలంలో ప్రజలకు అందుతాయని అన్నారు. మీ సేవ ద్వారా తొలుత మూడు జిల్లాల్లో చేపట్టిన విషయం తెలిసిందేనన్నారు. ఆ మూడు జిల్లాల్లో ఇప్పటివరకు కోటి 20 లక్షల అర్జీలు రాగా.. 30వేలు అర్జీలు మినహా మిగిలిన వాటన్నింటిని సకాలంలో అందించామన్నారు. 30వేల అర్జీలు మాత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యమయ్యాయన్నారు. వాటిని కూడా అధికారులు పరిష్కరిస్తున్నారన్నారు. దళారుల వ్యవస్థను రూపుమాపేందుకే మీసేవా చేపట్టామన్నారు. ధన్వాడకు చెందిన 600 మంది ఇప్పటికే మీసేవా ద్వారా లబ్ది పొందారన్నారు. లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులు చెల్లించాల్సిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు. 95లక్షల మంది రైతులు అసలు చెల్లిస్తున్నారని.. వారందరి వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో 42వేల కోట్ల రూపాయలమేర రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. మహిళల కోసం గతేడాది చేపట్టిన స్త్రీనిధి బ్యాంకు ద్వారా రెండోసారి మహిళలకు25వేల రూపాయల వరకు 48 గంటల్లో రుణాలిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. 1500 కోట్ల రూపాయలతో నిధి కూర్చిన విషయం విదితమేనన్నారు.ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల కోసం కేంద్ర స్థాయిలో ఒక బ్యాంకును వెయ్యి కోట్ల రూపాయల మూలధనంతో చేపడుతోందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్టం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో 3వేల కోట్ల రూపాయలు కేటాయించనున్నామని, వారి నిధులు వారి కోసమే ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. కేంద్రం కూడా ఎస్‌సి, ఎస్‌టిల గురించి ఒక పథకం చేపట్టాలని యోచిస్తోందన్నారు. గ్రామాల్లో కక్షలు తగ్గించేందుకే ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయించిన భూములను వారికే చెందేటట్టుగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇందిర జలప్రభ ద్వారా వారి భూములకు నీరందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా మంత్రి డికె అరుణ, ప్రజా ప్రతినిధులు కోరిన వాటన్నింటిని ఆమోదిస్తున్నామన్నారు. దయాకర్‌రెడ్డి ఒక కళాశాల కావాలని అడిగారు. మంజూరు చేయనున్నట్టు ప్రకటించారు. రిజర్వాయరులో నీరు ఉంటే జమ్ము చెరువుకు అనుసంధానం చేసేందుకు సిద్ధమేనన్నారు. అయితే అధికారులతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా ధన్వాడ మండలం మండపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో పాటు మంత్రులు ఎన్‌.రఘువీరారెడ్డి, డికె అరుణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.