నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతోనే సత్వర న్యాయ సేవలు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు27(జనంసాక్షి):
ప్రజలు, బాధితులకు సత్వర న్యాయ మందించేందుకు ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి డి. రాజేష్ బాబు అన్నారు.జిల్లాలోని జ్యుడిషియరీ, పోలీసు, రెవిన్యూ, అటవీ శాఖల అధికారులతో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం సమన్వయ సమావేశాన్ని డిస్టిక్ ప్రిన్సిపల్ జడ్జి అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమం లో భాగంగా బాధితులకు న్యాయం జరిగేలా నిందితులకు శిక్షలు పడేలా సమిష్టిగా కృషి చేద్దామని సంయుక్తంగా పిలుపునిచ్చారు. అలాగే పోలీసులు, న్యాయశాఖ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సుహృద్భావ వాతావరణంలో పని చేయడానికి అవసరమైన సమస్యలుపై చర్చించారు.
సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు మాట్లాడుతూ….
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి నెల కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.
జిల్లా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు జిల్లా కోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అదేవిధంగా ప్రభుత్వ శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలన్నారు.
పోలీస్ శాఖ నుండి కేసుల వాదనలకు కోర్టుల్లో చార్జిషీట్ దాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పలు కేసుల్లో పోలీస్ వారు సాధనం చేసుకున్న ఆస్తులను 24 గంటల లోపు న్యాయస్థానాల్లో సమర్పించాలన్నారు.
అదేవిధంగా ముద్దాయిల వయసు నిర్ధారణకు ఆధార్ తో కాకుండా పదో తరగతి మెమో లేదా డాక్టర్ నిర్ధారించిన సర్టిఫికెట్లను మాత్రమే పొందుపరచాలన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి సత్వర న్యాయమందేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టు ల న్యాయమూర్తులు జిల్లాలో పర్యటించేటప్పుడు ప్రోటోకాల్ ను తప్పనిసరిగా ఆయా శాఖల అధికారులు పాటించాలన్నారు.అటవీ శాఖ ఆధ్వర్యంలో నమోదు కేసుల్లో తప్పనిసరిగా నిందితుల సమగ్ర స్పష్టమైన ఆధారాలను పొందుపరచాలన్నారు.న్యాయమూర్తుల తీర్పులకు సహాయపడేలా ఉండాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ సివిల్ జడ్జి కే. స్వరూప, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కీర్తి సింహ, జిల్లా ఎస్పీ కే. మనోహర్, అడిషనల్ కలెక్టర్ ఎస్. మోతిలాల్, ప్రభుత్వ న్యాయవాది శ్యాం ప్రసాద్, జిల్లా అటవీ అధికారి రోహిత్ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు రామేశ్వర్, భరత్, ఆర్డీవో పాండు నాయక్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, డీఎస్పీలు మోహన్ కుమార్, గిరిబాబు, కృష్ణ కిషోర్, సిఐలు తదితరులు పాల్గొన్నారు.