నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి న్యూస్
పత్తికి పదును…. మిర్చికి అదును.
సకాలంలో వర్షాలు సంతోషంలో రైతులు.
సాగు పనుల్లో రైతులు.
మిర్చి నారు నాటుతున్న రైతులు.
పత్తి అంతర పనులలో రైతులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు28(జనంసాక్షి):
గత మూడు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లా లో కురుస్తున్న వర్షాల కారణంగా పత్తిపంటకు పదును, మిర్చికి అదును కావడంతో రైతులు పంట పొలాల్లో తీరిక లేకుండా పనులు చేస్తున్నారు.పత్తి పనులు చేసుకుంటూ క్రిమిసంహారక మందులను చల్లుతూ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మిర్చికి ఇప్పటికే నారుమల్లు వేసిన రైతులు వాటిని విత్తడానికి సిద్ధమవుతున్నారు.
పత్తి పంట సాగు ఖర్చుతో కూడుకున్నది. ముఖ్యంగా వర్షాధారం మీద ఆధారపడి, సాగు చేసే పత్తి పరిస్థితి మరి దయనీయం గా ఉంటుంది. పూత కాత దశలో వర్షాలు రాకుంటే దిగుబడి తగ్గుతుంది.ఈ ఏడాది ఖరీఫ్ 10 రోజులు ఆలస్యంగా మొదలై నప్పటికీ క్రమం తప్పకుండా వర్షాలు పడుతున్నాయి. పాతిక రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల పత్తికి కొంత నష్టం వాటిల్లింది. ఆ తరువాత వర్షం నిలిచిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అంతర వ్యవసాయం పనులు పుంజుకున్నాయి. కలుపు తీయడం ఎరువులు చల్లడం వంటివి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా క్రిమిసంహారక మందులు చల్లి తెగుళ్ళ నుండి పంటలను కాపాడుకుంటున్నారు. పూర్తి దశలో ఉన్న పత్తికి అనేక తెగుళ్లు సోకుతాయి. ఈ దశలో తెగుళ్లను నివారించకపోతే దిగుబడి తగ్గుతుంది. అందుకే క్షణం తీరిక లేకుండా రైతులు పంట పొలాల్లో నిమగ్నమై ఉన్నారు.మిర్చి సాగు చేసే రైతులు సైతం కురుస్తున్న వర్షాల వల్ల సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు.ఇప్పటికే నారు మల్లు వేశారు. దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు మిర్చి సాగుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.వర్షాలు కురుస్తుండడంతో మిర్చి నారు నాటు తున్నారు.మిర్చి పంటను జిల్లాలో అత్యధికంగా నల్ల మట్టి పొలాల్లో సాగు చేస్తారు. ఎర్ర భూములు సాగు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. మిర్చి కి మంచి ధర ఉండదు ఈసారి అత్యధికంగా పంటను సాగు చేశారు.జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పంట పొలాలకు ఊరట లభిస్తుంది. పత్తి మిర్చితోపాటు కూరగాయల సాగు పండ్ల తోటలు ఉద్యానవన సాగుపై రైతులు దృష్టి పెట్టారు. ఈసారి వర్షాధారంతో పాటు రిజర్వాయర్ల లో సైతం నీరు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ వర్షాలు రాకపోయినప్పటికీ కాలువల ద్వారా వచ్చే నీటిని పంట పొలాలకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. నెలలో రెండు సార్లు వర్షం పడిన అత్యధికంగా దిగబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కానరాని వ్యవసాయ అధికారులు:
గ్రామాల్లో సాగుబడి లో రైతులు నిమగ్నమై ఉన్నారు. వర్షాలు కురుస్తున్నడంవల్ల పత్తి ఇతర పంటలకు తెగులు సోకుతున్నాయి. తెగుళ్లను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవలసిన వ్యవసాయ అధికారులు ముఖం చాటేశారు.వర్షాల సమయంలో రైతులకు సలహాలు సూచనల ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా గ్రామాలకు ఏవో తో పాటు వ్యవసాయ యూనివర్సిటీ వారు వచ్చి రైతులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా సమీపాన పాలెం దగ్గర వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉంది. అక్కడ మెరుగైన వంగడాలు అత్యధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలను తయారు చేస్తుంటారు.కానీ అక్కడ తయారయ్యే విత్తన సంపదపై రైతులకు ఎటువంటి అవగాహన కల్పించడం లేదు.దీంతో రైతులు సాంప్రదాయ విత్తనాలతో పాటు పురాతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తు న్నారు. అందుకే వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం లేదు. తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో సుమారు 2500 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ గ్రామంలో పత్తి మిర్చి తప్ప ఇతర ఏ పంటలను సాగు చేయరు. వెయ్యి ఎకరాలకు పైగా పత్తి 81 ఎకరాలకు పైగా మిర్చి పంటను సాగు చేస్తారు. మిర్చి పత్తి పంటను అత్యధికంగా సాగు చేసే గ్రామాలను ఎంపిక చేసి అక్కడ వినూత్నంగా శాస్త్రీయ విధానాలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతులు చైతన్యమవుతారు. ఆ దిశగా ప్రభుత్వం స్పందించకపోవడంతో నేటికీ పురాతనమైన సాగును రైతులు అవలంబిస్తున్నారు.
కనబడని యాంత్రికరణ:
ప్రకృతి సహకరించి సాగుకు సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ పాలకులు మాత్రం సహకరించడం లేదు.ఆధునిక వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలని ఒకవైపు చెబుతూ అందుకు తగ్గట్టుగా యాంత్రిక పరికరాలు ఇవ్వడం లేదు.కనీసం యాంత్రిక వ్యవసాయ విధానం పట్ల చైతన్యం కలిగించే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. దున్నడం కలుపు తీయడం నాటడం తదితర పనులన్నీ పురాతన కాలం నాటి విధానాలనే అవలంబిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఆధునిక వ్యవసాయ విధానం అమలుకు రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే దిగుబడులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
