నాటిన మొక్కలను సంరక్షించాలి
నీటికి పడిపోయిన మొక్కలను సరి చేయాలి
* హరితహారం లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలి
* కరీంనగర్ మేయర్ సునీల్ రావు
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
హరిత కరీంనగర్ గా మార్చేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. హరితహారంలో భాగంగా శుక్రవారం రోజు నగరంలోని శాతవాహన ఫార్మా సైన్స్ కళాశాల లో నగరపాలక సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ” నగర వన వాటిక” ను పలువురు కార్పొరేటర్లు, కమీషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి మేయర్ సునీల్ రావు సందర్శించారు. గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాల నేపథ్యంలో ఇటివల పెద్ద సంఖ్యలో నాటిన మొక్కలు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. నగర వాటికలో నాటిన వివిద రకాల మొక్కలను నిశితంగా పరిశీలించి… వాటి సంరక్షణ చర్యలు పై సలహాలు, సూచనలు చేస్తూ..సంబందిత హరితహారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ… పట్టణాలు పచ్చదనంతో మెరువాలని… ప్రజలు ప్రకృతి ద్వారా వచ్చే స్వచ్చమైన గాలిని పీల్చి ఆరోగ్యవంతమైన జీవనం గడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ను ప్రతిష్ఠాత్మకంగా ప్రజల ముందుకు తెచ్చారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రతి ఒక్కరూ బాగస్వాములై పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరి రక్షించాలని పిలుపునిచ్చారు. ఇందులో బాగంగానే నగరపాలక సంస్థ ప్రతీ విడుతను ప్రతిష్ఠాత్మకంగా తీసికొని నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. గత విడుతల్లో కూడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఖాళీ స్థలాలు ఉన్న ప్రతి చోట డివిజన్ల వారిగా మొక్కలను నాటి ప్రత్యేక సిబ్బంది తో సంరక్షించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విడుతలో కూడ నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం తో పాటు ప్రజలకు పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ” నగర వన వాటికల” పేరిట పలు చోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా నగర వ్యాప్తంగా కూడ ప్రధాన రహదారుల డివైడర్లతో పాటు రోడ్లకు ఇరువైపులా మరియు డివిజన్ల లలో స్థలాలు ఉన్న చోట మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. మొక్కలు నాటేందుకు నగరపాలక సంస్థ స్వయంగా నర్సరీ ల్లో మొక్కలను పెంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్ నగరాన్ని హరితహారం నగరంగా మార్చేందుకు నగరపాలక సంస్థ కృషి చేస్తుందన్నారు. ఈ రోజు ఇటీవల ఏర్పాటు చేసిన నగర వన వాటికను సందర్శించి పరిస్థితి ని పరిశీలించడం జరిగిందన్నారు. వాటి సంరక్షణ చర్యల పై అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కురిసిన వర్షానికి నాటిన మొక్కలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరినట్లు తెలిపారు. మొక్కల మద్య ఉన్న వర్షం నీటిని తొలగించి… పడి పోయిన మొక్కలను సరిచేసి సంరక్షించాలని కోరినట్లు తెలిపారు. అంతే కాకుండా వన వాటికల మద్యలో నడిచేందుకు వీలుగా సరైన మట్టి రోడ్డు ను నిర్మాణం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగిలి సాగర్, భూమాగౌడ్, తుల రాజేశ్వరి బాలయ్య, సల్ల శారద రవీందర్,ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ కిష్టప్ప, మహేందర్, హరితహారం ఇంచార్జ్ నరెంధర్, తదితరులు పాల్గొన్నారు.