నాణ్యత ఉంటేనే మద్దతు ధరలు

జనగామ,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చే ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు, గిట్టుబాటు ధర లభిస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బండ పద్మ యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. ఈ-నామ్‌, హాకా ఆధ్వర్యంలో కందులు, వేరుశనగ కొనుగోళ్లను సక్రమం/-గా చేపడుతున్నామని అన్నారు. రైతులతో మాట్లాడి యార్డులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ధర ఎంత మేరకు లభిస్తుందని అడిగి తెలుసుకొని నాణ్యత ప్రమాణాలను పరీక్షించారు. నాణ్యమైన సరుకును ప్రతీ రోజు ఉదయం 5గంటల నుంచి 11గంటలలోపు తెస్తేనే యార్డులోకి అనుమతిస్తామని, తర్వాత వచ్చే వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. కందులు శుభ్రం చేసుకునే మిషన్ల కోసం రైతులు పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు కేవలం రెండు యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా, మంత్రి హరీశ్‌రావు పర్యటన తర్వాత మరో మూడు క్లీనింగ్‌ మిషన్లు తెప్పించినా రైతులు పాట్లు పడుతున్నారు. ఒక రైతు రాశి శుభ్రం చేసుకుంటుండగానే మరికొందరు రైతులు యంత్రాన్ని తరిలించేందుకు ఆరాట పడుతుండటంతో స్పల్పంగా ఘర్షణలు జరుగుతున్నాయి.