నార్సింగి ప‌రిధిలో నేడు ట్రాఫిక్ ఆంక్ష‌లు

రంగారెడ్డి జిల్లా (జనం సాక్షి) :

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం మంచిరేవులలో కోటి వృక్షార్చన కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టనున్నారు. అక్కడి ఫారెస్ట్రెక్‌ పార్కులో కేసీఆర్‌ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే సందర్భంగా ఆ పార్కును కూడా సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు నార్సింగి ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని సైబ‌రాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) నారాయ‌ణ నాయ‌క్ తెలిపారు. వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెళ్లాల‌ని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు.కోటి వృక్షార్చ‌న కార్యక్రమ నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అన్నివర్గాల ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు కోటి వృక్షార్చన కార్యక్రమ ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌, పీసీసీఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియల్‌, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు.