నాలుగేళ్లకే పుస్తకం రాసిన బుడతడు

దిస్‌పూర్‌ జూన్‌5(జనం సాక్షి) : నాలుగేళ్ల వయసులో పిల్లలు సాధారణంగా అక్షరాలు, పదాలు రాయడానికే నానా తంటాలు పడుతుంటారు. అలాంటిది నాలుగేళ్ల బుడతడు ఏకంగా పుస్తకమే రాసేశాడు. అసోంలోని నార్త్‌ లఖింపూర్‌ జిల్లాకు చెందిన అయాన్‌ గగోయ్‌ గోహెయిన్‌ నాలుగేళ్ల వయసులో పుస్తకం రాసి ‘భారత్‌లో అత్యంత పిన్న వయస్కుడైన రచయిత’గా పేరు సంపాదించాడు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అయాన్‌కు ఈ టైటిల్‌ అందజేసింది. నార్త్‌ లఖింపూర్‌లోని సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో చదువుతున్న అయాన్‌ ‘హనీకోంబ్‌’ అనే పుస్తకం రాశాడు. ఇది ఈ ఏడాది జనవరిలో ప్రచురితమైంది. ఇందులో 30 కథలను, తనకు తోచినట్లుగా ఊహాజనిత విషయాలను రాయడంతో పాటు అందమైన బొమ్మలు గీశాడు.ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దేశవ్యాప్తంగా అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తుల్లో అయాన్‌ పేరును చేర్చింది. పుస్తకం ప్రశంస వ్యాక్యం ప్రకారం.. అయాన్‌ ఏడాది వయసు నుంచే పెయింటింగ్స్‌ చేయడం మొదలుపెట్టాడట. మూడేళ్ల వయసు వచ్చే సరికి తనంతట తానుగా కథలు చెప్పడం ప్రారంభించాడట. అయాన్‌ తన నానమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటాడు. అతడి తల్లిదండ్రులు మిజోరాంలో ఉంటారు. రోజూ జరిగే సంఘటనల గురించి తాను రాస్తూ ఉంటానని, రోజూ తన చుట్టూ ఏం జరుగుతుంతో గమనించి వాటి గురించి రాస్తానని, అది మా తాతయ్యతో మాట్లాడిన విషయాలైనా కావొచ్చు, తాను నేర్చుకున్న ఏదైనా కొత్త విషయమైనా కావొచ్చు అని బుడతడు చెప్పుకొచ్చాడు. అయాన్‌కు తన తాతయ్య పుర్నో కంటా గగోయ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌, హీరో అట.