నాలుగేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలపడింది

– 400 బిలియన్‌ డాలర్ల మార్క్‌ ను దాటింది
– ఆసియాన్‌ దేశాల్లో ఇండోనేషియా చాలా కీలకమైంది
– భారతీయ మూలాలున్న వారిని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది
– ప్రధాని నరేంద్ర మోదీ
– ఇండోనేషియాలో భారత సంతతి ప్రజలతో సమావేశమైన మోదీ

జకార్తా, మే30( జ‌నం సాక్షి): గత నాలుగేళ్ళలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బలమైనదిగా రూపొందిందని, విదేశీ మారకద్రవ్యం 400 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా కార్తా కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రధాని అక్కడ భారతీయ సంతతి ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..  ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో టాప్‌ -2లో భారతదేశం ఉందని తెలిపారు. ప్రపంచం ఇప్పుడు భారతదేశాన్ని ప్రత్యేకంగా చూస్తోందన్నారు. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో భారతదేశం ర్యాంక్‌ మెరుగుపడిందన్నారు. మూడీస్‌ రేటింగ్స్‌లో భారతదేశం ర్యాంక్‌ 14 ఏళ్ళ తర్వాత తొలిసారి మెరుగుపడిందన్నారు. ఇండోనేషియాలో భారతదేశాన్ని జీవింపజేస్తున్న విూ అందరికీ నమస్కారాలు తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. తనకు ఘనంగా స్వాగతం పలికిన ఇండోనేషియా ప్రజలు, పిల్లలు ధన్యవాదాలు తెలిపారు. 10 ఆసియాన్‌ దేశాధినేతలతో కలిసి గణతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నామన్నారు. 1950లో జరిగిన మొదటి గణతంత్ర దినోత్సవాల్లో అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు పాల్గొన్నారన్నారు. తాను ఇక్కడికి 125 కోట్ల భారతీయుల ప్రతినిథిగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. భారతీయ మూలాలున్నవారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.  ఇండోనేషియా సాంస్కృతిక వైవిద్ధ్యాన్ని మోదీ
ప్రశంసించారు. ఆసియాన్‌ దేశాల్లో ఇండోనేషియా చాలా కీలకమైనదన్నారు. ప్రవాస భారతీయులు ఇప్పటికీ తమ మూలాల పట్ల మమకారం కనబరుస్తున్నారన్నారు. ప్రవాస భారతీయులు విజయం సాధిస్తే ఇరు దేశాల సంబంధాలు మరింత పటిష్టమవుతాయన్నారు. ఇండోనేషియాకు గుజరాత్‌తో కూడా గట్టి సంబంధాలు ఉన్నాయన్నారు. గుజరాతీ ఖిచిడీకి ఇండోనేషియాలో కూడా గొప్ప కీర్తిప్రతిష్ఠలు ఉన్నాయన్నాయన్నారు. గుజరాతీ ఖిచిడీని ఇండోనేషియాలో ఎంతో ఇష్టపడతారన్నారు. 90 నాటికల్‌ మైళ్ళ దూరంలో మనం లేమని, 90 నాటికల్‌ మైళ్ళ సవిూపంలో మనం ఉన్నామని, మనం పొరుగువారమేనని చెప్పారు. భారతదేశాన్ని ఇండోనేషియాకు అత్యంత సవిూప పొరుగు దేశంగా పేర్కొనాలని అందరినీ కోరారు.
మోడీకి ఇండోనేషియాలో ఘనస్వాగతం
ఇండోనేషియాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో మోడీ ప్రతినిధి స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో భారత్‌ – ఇండోనేషియా మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. అంతకు ముందు విమానాశ్రయంలో భారత ప్రధానికి ఇండోనేషియా అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. స్థానికంగా ఉండే భారతీయులు మోడీకి స్వాగతం పలికారు. ఇండోనేషియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ,ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగే సీఈఓ బిజినెస్‌ ఫోరం సదస్సులో మోదీ, జోకో పాల్గొన్నారు. తూర్పు ఆసియా దేశాల్లో రాజకీయ, ఆర్ధిక సంబంధాలతోపాటు వ్యూహాత్మక అభిరుచుల కోసమే ఈ పర్యటన ముఖ్యోద్దేశంగా భావిస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ఇది ప్రధానిగా ఇండోనేషియాకు తన మొట్టమొదటి పర్యటనగా మోదీ పేర్కొన్నారు. భారత్‌ – ఇండోనేషియా దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదంతో పోరాడుతాయని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఇండోనేషియాలో జరిగిన టెర్రరిస్టుల దాడిలో మృతులకు మోడీ నివాళులర్పించారు. ఉగ్రవాద చర్యలకు అమాయక ప్రజలు బలవుతున్నారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.