నాలుగేళ్లలో సగటు వృద్ధిరేటు 10.5శాతం సాధించాం
సురక్షిత నగరాల్లో దేశంలోనే తిరుపతి 2వస్థానంలో నిలిచింది
అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
అమరావతి,ఆగస్ట్21(జనం సాక్షి): మనం ఇప్పుడు ఒక అద్భుత సమయంలో ఉన్నామని, అనుకున్న పనిని పూర్తి చేసే సమయంలో ఉన్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం కార్యదర్శులు, హెచ్‌వోడీలు, కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామదర్శిని, వివిధ శాఖల పురోగతి, కేంద్రసాయం తదితర అంశాలపై చర్చించారు. మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ముందంజలో ఉన్నామని, నాలుగేళ్లలో వివిధ రంగాల్లో 511అవార్డులు సాధించామని అన్నారు. నాలుగేళ్లలో సగటు వృద్ధిరేటు 10.5శాతం సాధించామని చంద్రబాబు పేర్కొన్నారు. సురక్షిత నగరాల్లో దేశంలోనే తిరుపతి 2వస్థానంలో నిలిచిందని గర్వంగా చెప్పారు. మెరుగైన జీవన నగరాల్లో తిరుపతి, విజయవాడ ముందున్నాయని, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో మనమే ముందంజలో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, డిసెంబర్ కల్లా అన్నిగ్రామాల అభివృద్ధి ప్రణాళికలు తయారుచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. మండల, జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్లు రూపొందించాలన్నారు. వాటి నుంచి రాష్ట్రస్థాయి విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని, నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏం చేశామో విశ్లేషిద్దామని, భావి ప్రణాళికలు తయారుచేద్దామని ఆయన అన్నారు. జనవరికల్లా లక్ష్యాలను చేరుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
——————–