నాలుగేళ్లలో 10కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చాం!

– భవిష్యత్తులో శుద్ధమైన ఇంధనం అందించటమే లక్ష్యం
– ప్రధాన మంత్రి నరేంద్రమోదీ!
న్యూఢిల్లీ, మే28(జ‌నం సాక్షి ) : భాజపా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే 10కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చామని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటీవలే నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన లబ్ధిదారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ నాలుగేళ్ల భాజపా ప్రభుత్వం హయాంలో దేశ వ్యాప్తంగా 10కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లను ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం ఆరు దశాబ్దాల స్వతంత్ర భారతవనిలో 2014 ముందు వరకూ కేవలం 13కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉంటే, ఈ నాలుగేళ్లలోనే తమ ప్రభుత్వం 10కోట్ల వంట గ్యాస్‌ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు. వంటగదిలో పొగతో అల్లాడిపోతున్న మహిళలు, పిల్లలకు ఆ కష్టం నుంచి బయటపడేశామని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల్‌ యోజన ద్వారా లబ్ధి పొందిన మహిళలతో ఆయన మాట్లాడుతూ.. చిన్నతనంలో తన తల్లి కట్టెల పొయ్యిపై పిడకలతో వంట చేసేదని, ఆ సమయంలో పొగ కారణంగా నరకం అనుభవించేవారని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్‌లో 100శాతం ఇళ్లకు శుద్ధమైన ఇంధనం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.  2014 వరకు దేశంలో కేవలం 13కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఉన్నత ఆదాయ వర్గాల ఇళ్లలోనే ఉండేవి. గత నాలుగేళ్లలో భాజపా ప్రభుత్వం 10కోట్ల గ్యాస్‌ కనెక్షన్లను, అదీ పేదవారికి మాత్రమే అందించింది. వీరిలో ఎక్కువగా దళితులు, గిరిజనులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవడం ద్వారా సామాజిక సాధికారిత దిశగా అడుగులు వేశాం.’ అని మోదీ అన్నారు. వచ్చే మూడేళ్లలో మరో 5 కోట్ల మంది పేద మహిళలకు వంట గ్యాస్‌ కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.