నాల్గో రోజుకు చేరిన పాదయాత్ర

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 9 (: ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర ఆదివారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావించడతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలు, తెలంగాణ విషయంలో అధికార పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీలు ప్రజా ధనాన్ని కొల్లగొడుతూ అధికారాన్ని నిలపుకోవడానికే ప్రయత్నిస్తున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. మీకు అండగా ఉంటూ, మీ సమస్యలను తీరుస్తానంటూ చంద్రబాబు హామీలు ఇస్తూ, మరోవైపు తన 9 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నారు. గత మూడు రోజులుగా కొనసాగిన చంద్రబాబు పాదయాత్ర  45 కిలో మీట్ల మేర కొనసాగింది. ఆదివారం నిర్మల్‌ నియోజకవర్గంలోకి పాదయాత్ర చేరుకుంది. విద్యార్థులను కలవడం, బీడీ కార్మికులను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం, బస్సుల్లో ఉన్న ప్రయాణికులను కలుసుకుంటున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే రైతులకు, సామాన్య ప్రజలకు, విద్యార్థులకు సౌకర్యాలతోపాటు, సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. చంద్రబాబు పాదయాత్రలో  ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌రాథోడ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్‌తోపాటు నాయకులు పాల్గొన్నారు.