నావల్‌ చీఫ్‌గా లంబా

1

– బాధ్యతల స్వీకారం

న్యూఢిల్లీ,మే31(జనంసాక్షి): భారత త్రివిధ దళాలలో ఒకటైన నావికాదళ కొత్తసారధిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా నియమితులయ్యారు. ఈ మేరకు  నేవీ అధిపతిగా అడ్మిరల్‌ సునిల్‌ లంబా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 58 ఏళ్ల లంబా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత నావికాదళానికి ఆయన 21వ అధిపతి. మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌కే ధోవన్‌ పదవికాలం మంగళవారం పూర్తవడంతో లంబాను నూతన అధిపతిగా నియమించిన విషయం తెలిసిందే. నావిగేషన్‌, డైరెక్షన్‌లో స్పెషలిస్ట్‌ అయిన లంబా డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కళాశాల పూర్వ విద్యార్థి. ఐఎన్‌ఎస్‌ సింధుదుర్గ్‌, ఐఎన్‌ఎస్‌ దునగిరికి నావిగేటింగ్‌ అధికారిగా పనిచేశారు. ఐఎన్‌ఎస్‌ కాకినాడ(మైన్‌స్వీపర్‌), ఐఎన్‌ఎస్‌ హిమగిరి(ఫ్రిగేట్‌), ఐఎన్‌ఎస్‌ రణ్‌విజయ్‌, ఐఎన్‌ఎస్‌ ముంబయి లాంటి ఫ్రంట్‌లైన్‌ యుద్ధవిమానాలకు కమాండర్‌గా వ్యవహరించారు. గుజరాత్‌, మహారాష్ట్ర నావెల్‌ ఏరియా అండ్‌ కమాండెంట్‌లో ఫ్లాగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సికింద్రాబాద్‌లోని డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కళాళాలలో చదువుకుని.. అక్కడేఫ్యాకల్టీగా పనిచేశారు. 30ఏళ్ల పాటు నావికదళానికి సేవలందించినందుకుగానూ.. పరమ విశిష్ట సేవాపతకంతో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకున్నారు.