నాసిరకం పరికరాలతో బోరింగ్ రిపేర్లు
ఆదిలాబాద్,మే15(జనం సాక్షి ): బోరింగ్‌ల మరమ్మత్తులకు పనులు చేయించినా నెల రోజుల వ్యవధిలోనే పనిచేయకుండా పోయాయయన్న విమర్శలు ఉన్నాయి. పైపులు తుప్పుపట్టడం వంటి సమస్యల వెనుక కారణాలు పరిశీలిస్తే ఐఎస్‌ఐ మార్కుగల పరికరాలు కాకుండా ఊరూపేరూలేని పరికరాలను అమర్చారని తెలుస్తోంది. ఒక్కో చేతిపంపునకు రూ.12 వేల విలువైన పరికరాలు అందిస్తే, అధికారులు తనిఖీ చేసి, నాణ్యంగా ఉన్నాయని ధ్రువీకరించాలి. అనంతరం పంచాయతీ జిల్లా అధికారి అనుమతితో నిధులు చెల్లిస్తారు. జిల్లాలో ఈసారి టెండరు పక్రియకు తిలోదకాలిచ్చి, పంచాయతీలకు పరికరాలు సరఫరా చేసే సంస్థకు అప్పగించారని ప్రచారం జోరుగా సాగుతోంది. కేవలం ఐదారు వేల విలువ చేసే పరికరాలు మాత్రమే అందించి అధికారులు అక్రమాలు తెరతీశారు. నాసిరకం పరికరాలు వినియోగించడం వల్ల చేతిపంపులు సక్రమంగా పనిచేయడం లేదు. అయితే ఇలాంటి ఆరోపణలను పరిశీలించి అన్ని మండలాల్లో
ఆయా ఏఈలతో పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.