నా కెరీర్ లో బెస్ట్ ఎచీవ్ మెంట్

10s9g17aబ్యాడ్మింటన్ వరల్డ్ టాప్ ర్యాంక్ దక్కడంపై ఇండియన్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. తన కెరీర్ లో ఇదే బెస్ట్ అచీవ్ మెంట్ అని పేర్కొంది. ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీస్ లో నెగ్గిన తర్వాత తనకు టాప్ ర్యాంక్ రావడంపై సైనా స్పందించింది. టాప్ ర్యాంక్ తో పాటు ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ నెగ్గడం మరచిపోలేనని సైనా తెలిపింది.
సైనాకు వరల్డ్ బ్యాడ్మింటన్ టాప్ ర్యాంక్ రావడంపై ఆమె తండ్రి హర్వీర్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. సైనా చూపిన తెగువపై ప్రశంసల జల్లు కురిపించారు. సైనా ముందు ఇంకా ఎన్నో సవాళ్లున్నాయన్నారు. ఇక, సైనా వ్యక్తిగత కోచ్ విమల్ కుమార్ సైతం ఏస్ షట్లర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. సైనా నిజంగా టాప్ ర్యాంక్ కు అర్హురాలన్నాడు.
ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో ఇవాళ జరిగిన తొలి సెమీస్ లో జపాన్ ప్లేయర్ హషిమోటోను ఓడించి సైనా కల సాకరం చేసుకుంది. చైనా షట్లర్ లీ గ్జూరీని వెనక్కినెట్టి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. 2010లో తొలిసారి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్ సాధించిన సైనా.. మళ్లీ 2013లో టాప్ ర్యాంక్ ను తృటిలో మిస్ చేసుకుంది. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ తో పాటు.. ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ లో సత్తా చాటి టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది.
బ్యాడ్మింటన్ హిస్టరీలో ఇండియాకు తొలి ఒలింపిక్ మెడల్ అందించిన సైనా.. 8 సూపర్ సీరిస్ లతో పాటు ఏడు గ్రాండ్ ప్రిక్స్ టైటిల్స్ నెగ్గింది. ఈ ఏడు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. అయితే, ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ నెగ్గి ఇన్నాళ్లుగా ఊరిస్తున్న టాప్ ర్యాంక్ ను సగర్వంగా చేజిక్కిచుకుంది. ఉమెన్స్ సింగిల్స్ లో టాప్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ షట్లర్ గా అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకుంది.
వరల్డ్ బ్యాడ్మింటన్ లో చైనా ఏకఛత్రాధిపత్యంపై పోరాటం చేస్తున్న సైనా.. ఎట్టకేలకు తన కల సాకారం చేసుకుంది. టాప్ ర్యాంక్ సాధించి భారత బ్యాడ్మింటన్ ఖ్యాతిని మరింత పెంచింది. తొమ్మిదేళ్ల కెరీర్ లో తొలిసారి అగ్రస్థానం సాధించి 2015లో రెండో సీజన్ ను ఘనంగా ఆరంభించింది. చాలాకాలం తర్వాత ఉమెన్స్ సింగిల్స్ లో చైనా ప్లేయర్ ను వెనక్కినెట్టి బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది.
టాప్ ర్యాంక్ సాధించి భారత బ్యాడ్మింటన్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.