.నా పేరు ఉమర్‌ ఖాలిద్‌.. టెర్రరిస్టును కాను

4
– లొంగిపోను.. అరెస్టు చేసుకోండి

న్యూదిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి): ”నా పేను ఉమర్‌ ఖాలీద్‌..నేను టెర్రరిస్టును కాను.. కనుక లొంగిపోను.. కావాలంటే మీరే వచ్చి అరెస్టు చేసుకోండి” అని . దేశద్రోహం కేసులో నిందితుడైన ఉమర్‌ ఖాలీద్‌ అన్నాడు.సోమవారం యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతూ పోలీసులు తనపై టెర్రరిస్టు అనే ముద్ర వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించాడు. దేశద్రోహం కేసులో నిందితులైన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అయిదుగురు విద్యార్థులు కనిపించకుండా పోయి గత రాత్రి యూనివర్సిటీలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు తమంతట తాముగా లొంగిపోబోమని, పోలీసులే వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చని అంటున్నారు. విద్యార్థులు జేఎన్‌యూలో ఉన్నారన్న సమాచారం అందడంతో పోలీసులు క్యాంపస్‌ బయట భద్రత పెంచారు. వారు లొంగిపోతే అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చని యూనివర్సిటీ బయటే ఎదురుచూస్తున్నారు. కానీ విద్యార్థులు తాము లొంగిపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. కావాలంటే వచ్చి అరెస్టు చేసుకోవచ్చని తెలిపారు. కానీ రాతపూర్వక అనుమతి లభించే వరకు తాము యూనివర్సిటీ క్యాంపస్‌లోకి వెళ్లమని పోలీసులు తెలిపారు. పోలీసులను నిన్న యూనివర్సిటీ లోపలికి వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో పోలీసులు క్యాంపస్‌ బయట ఉన్నారు. నిందిత విద్యార్థులకు మద్దతుగా ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు క్యాంపస్‌లోనే ఉన్నట్లు సమాచారం. దాంతో జేఎన్‌యూ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేఎన్‌యూలో కొందరు విద్యార్థులు అభ్యంతరకర నినాదాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అదే కేసులో నిందితులుగా ఉన్న ఉమర్‌ ఖలీద్‌, అనిర్బన్‌, అశుతోష్‌, రమా నాగ, అనంత్‌ ప్రకాశ్‌లు కన్నయ్య కుమార్‌ అరెస్ట్‌ తర్వాత కనిపించకుండా పోయి నిన్న యూనిర్సిటీలో ప్రత్యక్షమయ్యారు. తాము ప్రాణ భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిందిత విద్యార్థులు పేర్కొన్నారు. తాము భారత వ్యతిరేక నినాదాలు చేయలేదని వారు చెప్తున్నారు.