నింగికెగసిన వెనిజులా వేగుచుక్క
అధ్యక్షుడు చావేజ్ ఇకలేరు
పోరాట యోధునికి ప్రపంచం నివాళి
వెనిజులా, మార్చి 6 (జనంసాక్షి):ధ్రువతార రాలిపోయింది.. అరుణతార అస్తమించింది.. ధీరత్వంతో, పోరాట పటిమతో జాతిని జాగృతం చేసిన వెనిజులా అధ్యక్షుడు, పోరాట యోధుడు హ్యూగో చావెజ్ మృతి చెందారు. క్యాన్సర్ వ్యాధితో కొంతకాలంగా బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం 11.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో యావత్ దేశం దుఃఖసాగరంలో మునిగిపోయింది. 14 సంవ త్సరాలకు పైగా జాతికి మార్గనిర్దేశనం చేసిన చావెజ్ మరణం తో కన్నీటిసాగరమైంది. ఆశాకిరణం అర్ధంతరంగా
అస్తమిం చడంతో వెనిజులా గుండె పగిలింది. చావెజ్ మృతి చెందారన్న వార్తను ప్రభుత్వం ప్రకటించింది. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఉపాధ్యక్షుడు నికోలస్ మదురో దిగ్భాం తికరమైన ప్రకటన చేశారు. ‘అనారోగ్యంతో దాదాపు రెండేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన చావెజ్ ఇక లేరు’ అని జాతీయ చానల్‌లో వెల్లడించారు. అధ్యక్షుడు మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడు మదురో బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడిగా మదురోను నియమించాలని చావెజ్ చివరి కోరిక అని విదేశాంగ శాఖ మంత్రి ఎలియాస్ జువా ప్రకటించారు. నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహించి చావెజ్ వారసుడిని ఎన్నుకుంటామని, అప్పటివరకు మదురో అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. చావెజ్ మృతితో ప్రభుత్వం ఏడురోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. సోమవారం వరకూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులిస్తున్నట్లు తెలిపింది. మృతికి సంతాపం తెలుపుతూ వర్తక వ్యాపార, వాణిజ్య సంస్థలు, ¬టళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. చావెజ్ అభిమానులు శాంతియుత ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. అభిమాన నేత మరణాన్ని వెనిజులా దేశస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.
1954 జూలై 28న జన్మించిన చావెజ్ 1999 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వెనిజులాలో అమెరికా పెత్తనానికి స్వస్తి పలికి సోషలిజానికి పట్టం కట్టిన ఘనత ఆయనదే. సంక్షేమమే తన ధ్యేయమని చాటి.. దాన్ని అమలు చేసేందుకు నిరంతరం కృషి చేశాడు. తన సంస్కరణలతో వెనిజులా వాసుల హృదయాలతో పాటు అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకించి ఇతర దేశాల హృదయాలను గెలుపొందాడు. అటువంటి చావెజ్ రెండేళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు. ఇటీవలే కరాకన్ ఆస్పత్రిలో చేరారు. కీమోథెరపి చికిత్స కూడా చేయించుకున్నారు. అయితే, అంతుచిక్కని పెల్విన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన.. నాలుగుసార్లు క్యూబా రాజధాని హవానాలో సర్జరీ కూడా చేయించుకున్నారు. కానీ
ఫలితం లేకపోయింది.
చావెజ్ మరణానికి కొన్ని గంటల ముందు.. ఉపాధ్యక్షుడు మదురో ప్రసంగిస్తూ తమ శత్రువులకు హెచ్చరికలు జారీ చేశారు. జాతిని అస్థిరపరిచేందుకు యత్నించే వారి చర్యలను తిప్పికొడతామన్నారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ‘హింసకు తావు లేదు. ఆక్రోశానికి చోటు లేదు. మా హృదయాల్లో ప్రేమ, శాంతి మాత్రమే ధ్వనిస్తుంది’ అని పేర్కొన్నారు.