నిజంగానా? నమ్మాలా!?

నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం
గులాంనబీ ఆజాద్‌
న్యూఢల్లీి, జూన్‌ 2 (జనంసాక్షి) :
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ ఆదివారం పలు నమ్మశక్యం కాని వ్యాఖ్యలు చేశారు. నెలరోజుల్లోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామంటూ ప్రకటించారు. సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు, ఇద్దరు ఎంపీలు, మాజీ మంత్రి సహా పలువురు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో ఇంతకాలం తెలంగాణకు అడ్డంగా మాట్లాడే ఆజాద్‌ ఉన్నట్టుండి స్వరం మార్చారు.  మరికొన్ని సమావేశాలు నిర్వహించి నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆజాద్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మరింత ఓపిక పట్టాలని సూచించారు. ఇప్పటికే అనేకసార్లు వారితో సమావేశాలు నిర్వహించామన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వరుస సమావేశాలు నిర్వహించామన్నారు. కుటుంబ, బంధువుల ప్రయోజనం కోసమే కొందరు పార్టీని వీడారన్నారు. అంతేగానీ వారికి తెలంగాణపై ఎలాంటి మమకారం లేదన్నారు. వారంతా బేరసారాలు సాగించి పార్టీని వీడారన్నారు. ఇంకెవ్వరూ టీఆర్‌ఎస్‌లో చేరబోరని స్పష్టంచేశారు. ఈ నెలలోనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే అయినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ తెలంగాణ ప్రాంతీయుడేనని అన్నారు. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి కారణం రాజకీయ పార్టీలేనని అన్నారు. రెండు ప్రాంతాల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు ప్రారంభించామని తెలిపారు. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎందుకు విడిచారో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ అత్యంత కీలకమైందని అన్నారు. స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధులు లేకుండా ఉండడం అంత మంచిది కాదన్నారు.