నిజామాబాద్‌లో 36 టేబుళ్ల కోసం ఇసిని కోరాం
ప్రస్తుతానికి 18 టేబుళ్ల వారీగా లెక్కింపు
అనుమతి వస్తే త్వరగా ఫలితం వెల్లడించే అవకాశం: కలెక్టర్
నిజామాబాద్,మే20(జనంసాక్షి): ఈ నెల23న లోక్‌సబ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్‌ఎం రావు తెలిపారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 185 మంది పోటీ చేశారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమ వుతుందని గ్రహించి 18 టేబుళ్ల ద్వారానే ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇలా చేయడం వల్ల మొదటి రౌండ్ ఫలితం రెండు గంటలు పట్టొచ్చు. 36 టేబుళ్ల వారీగా ఓట్లను లెక్కించేందుకు కావాల్సిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘానికి నివేదించామన్నారు. అక్కడి నుంచి అనుమతి రావల్సి ఉంది. 36 టేబుళ్లు ఏర్పాటు చేస్తే ఓట్ల లెక్కింపునకు సమయం తక్కువ తీసుకుంటుంది. 18 టేబుళ్లు ఏర్పాటు చేస్తే నిజామాబాద్ అర్బన్, రూరల్‌లో 16, బోధన్, బాల్కొండలో 14, ఆర్మూర్ నియోజకవర్గంలో 12 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే 36 టేబుళ్లను ఏర్పాటు చేస్తే ప్రతి నియోజవకర్గంలో సగం రౌండ్లలోనే పూర్తవుతుంద న్నారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు డిచ్‌పల్లిలోని సీఎంసీలో, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాలలో ఉంటుందని వివరించారు. ఓట్ల లెక్కింపు కోసం సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్లు, మైక్రో పరిశీలకులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 23న నిర్వహించే పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కింపు ఏర్పాట్లు చేస్తున్నందున అభ్యర్థులు, సిబ్బంది రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. లోనికి గుర్తింపు కార్డులు ఉన్నవారిని అనుమతించాలని సూచించారు. అనుమానంగా ఎవరు కనిపించినా తనిఖీ చేయాలన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించేందుకు అవసరమైన ఏర్పాట్లు చూసుకోవాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున ఏజెంట్లు కూడా ఎక్కువ సంఖ్యలో రానున్నారు. అందరిని ఒకేసారి లెక్కింపు చేపట్టే కేంద్రంలోకి పంపించడం సాధ్యం కాదు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారికి లోపలికి అనుమతి ఉంటుంది. గుర్తింపులేని పార్టీలు, స్వతంత్రులకు సంబంధించిన ఏజెంట్లను వంతుల వారీగా పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లను ఎట్టి
పరిస్థితుల్లో అనుమతించమని,అభ్యర్థులు, ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలన్నారు. విూడియాకు మాత్రం వారికి కేటాయించిన గది వరకు మాత్రమే అనుమతిస్తామన్నారు.