నిద్ర మాటున నిఘానేత్రం….

దేశంలో పేలుళ్లు సంభవించడం, అశాంతికి ఆజ్యం పోయడం, దానికి కారణమైన ముష్కర మూకల ఉనికిని మన నిఘా నేత్రం పసిగట్టకపోవడం ఇదంతా షరా మామూలే. ఇదంతా చాలాకాలంగా జరుగుతూనే ఉంది. అనుభవాల్లోంచి గుణపాఠం నేర్చుకోవడంలో మనం వైఫల్యం చెందుతూనే ఉన్నాం. దానికి నిదర్శనంగా మరోమారు పూణేలో బాంబులు పేలాయి. ఒకటి రెండు కాదు..ఏకంగా ఐదు..ఏడు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఐదు చోట్ల ఈ పేలుళ్లు జరిగాయి. మహారాష్ట్రలో అభివద్ధి చెందిన నగరమైన పూణేలో అదీ మహారాష్ట్రకే చెందిన షిండే హోం శాఖ కొత్త మంత్రిగా నియమితులైన రోజే ముష్కరులు ఈ దాడి చేసి ప్రభుత్వానికి, హోంమంత్రికి సవాల్‌ విసిరారు. హోంమంత్రిగా తాను నడవబోయేది పూల బాట కాదని, తన ముందున్నది ముళ్ల బాటేనని షిండేకి అర్దమయ్యే ఉంటుంది. దేశంలో బాంబు ప్రేలుళ్లు జరగడం కొత్త కాదు. రైళ్లు, బస్సులు, పార్కులు, థియేటర్లు ఏదీ బాంబు దాడులకు అతీతం కాదని ఇప్పటికే అనేక సంఘటనలు బయటపెట్టాయి. అయినా మన  పాలకులు కళ్లు తెరవరు. తీవ్రవాద దాడుల నిర్మూలనకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటుకు చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన మన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉగ్రవాద దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందే పసిగట్టడంలో మన భద్రతా, నిఘా నేత్రాలు విఫలమవుతూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థల్లో మనది ఒకటి అంటూ పాలకులు ఢంకా బజాయిస్తారు. మన నిఘా వ్యవస్థ చాలా పటిష్టమైనదంటూ ఊదరగొడ్తారు. కానీ దురాదృష్టవశాత్తు ఇవేవీ బాంబు పేలుళ్లను ఆపలేకపోతున్నాయి. ఒక్క దగ్గర ఒక సారి బాంబు పేలుడు జరిగిందంటేనే అది నిఘా వైఫల్యమనుకోవచ్చు..కానీ ఒకే దగ్గర రెండు మూడు సార్లు పేలుళ్లు జరిగితే దాన్నేమంటారో నిఘా అధికారులు.. రాజకీయ నేతలే చెప్పాలి..బాంబు పేలుడు జరగగానే రెడ్‌ అలర్ట్‌ పేరుతో ఒకటి రెండు రోజులు హడావిడి చేసే భద్రతాధికారులు ఆ తర్వాత అంతా మామూలే అన్నట్లుగా చూసీ చూడనట్లుగా ఉండి పోతారు..రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు..ఇది ప్రభుత్వ వైఫల్యమేననీ, ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ప్రతిపక్షాలు, ప్రపంచంలో ఎక్కడైనా బాంబు దాడులు జరుగాయంటూ, దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నారంటే అధికార పక్షం హోరాహోరీగా విమర్శించుకొంటాయి. అసలు సమస్యను మరుగున పర్చి రాజకీయం చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకొనే రాజకీయ పార్టీలు సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో మాత్రం విఫలమవుతున్నాయి…ఉగ్రవాదులు తమ అత్తారింటికి వచ్చి వెళ్లినంత ఈజీగా మన దేశంలోకి చొరబడి, బాంబు దాడులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన వ్యవస్థ మాత్రం మన దగ్గర లేకపోవడం సిగ్గుపడాల్సిన విషయం..మన నిఘా వ్యవస్థను పటిష్టపరచడానికి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం భాదాకరం..దేశాన్ని అస్థిరపరచాలన్న ఏకైక లక్ష్యంతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ సమస్య ఆసియాలో చైనా మినహా దాదాపు అన్ని దేశాల్లోనూ కనబడ్తుంది. అమెరికాలో 9 11 దాడుల తర్వాత మళ్లీ ఉగ్రవాద ఘటన జరగలేదు. అదే విధంగా మన దేశం కూడా కఠిన చట్టాలు ఏర్పరిచి ఉగ్రవాద ఘటనలను నివారించాలి. ప్రభుత్వం  బాంబు దాడులు జరగకుండా పటిష్టమైన నిఘా, భద్రతా వ్యవస్థను ఏర్పరిచి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలి. ప్రజలు కూడా అప్రమత్తతో వ్యవహరించి తమను తాము కాపాడుకోవాలి.. ఎందుకంటే మన అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత..