నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన పీఎస్‌ఎల్వీ సీ-20
భారత కీర్తి విశ్వవిఖ్యాతం : ప్రణబ్
శ్రీహరికోట, ఫిబ్రవరి25(జనంసాక్షి):
పీఎస్‌ఎల్వీ సీ 20 ప్రయోగంతో భారత్ కీర్తి విశ్వవిఖ్యాతమైందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. సోమవారం షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ 20ని ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం అంతర్జాతీయ ప్రమాణాలను అధిగమించిందని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలో భారత్ ప్రపంచ స్థాయికి చేరిందన్నారు. భారత్- ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు ఈ ప్రయోగం తోడ్పడుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, వ్యవసాయం మరెన్నో పరిశోధనలకు ఈ ప్రయోగం తోడ్పడుతుందని ఆయన అభిలషించారు. దేశీయ అవసరాలు, జీవన ప్రమాణాలు పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానం మరింత అధునాతనం కావాలన్నారు. అంతరిక్ష పరిశోధనలో మనం వేసే ప్రతి అడుగు జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకుండా దేశం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించలేమని, పేదరికం, నిరక్షరాస్యత వంటి సమస్యలకు సమాధానం చెప్పగల శక్తి విజ్ఞానశాస్త్రానికే ఉందన్నారు. మారుమూల ప్లలెలకు సమాచారం చేరవేసేలా అంతరిక్ష పరిజ్ఞానం ఉపయోగపడుతుందన్నారు. ఎడ్యుశాట్ వల్ల ప్లలెల్లోని మారుమూల ప్రాంతాలకూ విద్యను చేరవేయగలిగామని రాష్ట్రపతి తెలిపారు.
నిప్పులు చిమ్ముతూ..
అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరోమైలురాయిని చేరుకుంది. షార్‌సెంటర్‌నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ 20 నిప్పులు చిమ్ముకుంటూ విజయవంతంగా గగనంలోకి దూసుకెళ్లింది. తీసుకెళ్లిన అన్ని ఉపగ్రహాల్ని రాకెట్ విజయవంతంగా కక్ష్యలో చేర్చింది. సరళ్, నియోశాట్, మూడు సూక్ష్మ ఉపగ్రహాలను కూడా పీఎస్‌ఎల్‌వీ సీ 20 కక్ష్యలోకి చేర్చింది. పీఎస్‌ఎల్‌వీ సీ 20 ఒక్కో దశను విజయవంతంగా పూర్తిచేస్తూ గమ్యం చేరడంతో షార్ సెంటర్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులు ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించి శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ప్రయోగం విజయవంతం కాగానే లేచి రాష్ట్రపతి ప్రణబ్, గవర్నర నరసింహన్, సిఎం కిరణ్‌లకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆనందం పంచుకున్నారు. శాస్త్రవేత్తలు కూడా ఒకరినొకరు అభినందించుకున్నారు. షార్ సెంటర్‌నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ 20ని సోమవారం సాయంత్రం 6.01 గంటలకు ప్రయోగించారు. నిప్పులు చెరగుతూ పీఎస్‌ఎల్‌వీ లక్ష్యం దిశగా నింగిలోకి దూసుకెళ్లింది. సరళ్, 6 విదేశీ ఉపగ్రహాలతో సహా మొత్తం 8 ఉపగ్రహాలను ఇది నింగిలోకి తీసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తదితరులు షార్‌సెంటర్ మిషన్ రూమ్‌నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. శ్రీహరికోట (సూళ్లూరుపేట) ఫిబ్రవరి 25 : దీంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతలో చేరిన తన 101వ ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. విజయవంతంగా మొదటి, రెండు, మూడు, మూడు దశలు పూర్తి చేసుకున్న పీఎస్‌ఎల్వీ-సీ 20, సరళ్‌తోపాటు- 6 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్ళింది. నెల్లూరు జిల్లా షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి సోమవారం సాయంత్రం 6.01 నిమిషాలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ20 ప్రయోగం విజయవంతమైంది. రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. 5.56 నిముషాలకు ప్రయోగించాల్సి ఉండగా ఐదు నిముషాలు ఆలస్యంగా 6.01 గంటలకు ప్రయోగించారు. పీఎస్‌ఎల్‌వీ-సీ20 రాకెట్ ద్వారా అంతరిక్షలోకి 7 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు.
ఈ విజయం గొప్ప స్ఫూర్తినిచ్చింది : రాధాకృష్ణన్
ఈ విజయం తమకు గొప్ప స్ఫూర్తినిచ్చిందని ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పీఎస్‌ఎల్వీ సీ 20 ప్రయోగం విజయవంతం అయ్యాక ఆయన మాట్లాడారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం తమలోని విజయకాంక్షను మరింతగా పెంచిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మరిన్ని పరిశోధనలకు ఇదో స్ఫూర్తి అని పేర్కొన్నారు.
శనివారం నుంచే కౌంట్‌డౌన్
ఈ ప్రయోగంలో భాగంగా శనివారం ఉదయం 6.56 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. తొలిరోజు 4వ దశ మోటారులో 2.56 టన్నుల ద్రవ ఇంధనాన్ని విజయవంతంగా నింపారు. ఆదివారం రెండో దశ మోటారులో 41.72 టన్నుల ద్రవ ఇంధనాన్ని (నింపడం పూర్తి చేశారు. ఒకటో దశ మోటారులో 138.19 టన్నులు, మూడోదశ మోటారులో 7.65 టన్నుల ఘన ఇంధనం నింపి ఉంచారు. దీంతో నాలుగు దశల మోటార్లతో పీఎస్‌ఎల్‌వీ-సీ20 ప్రయోగానికి సిద్ధమైంది. ప్రయోగం విజయవంతం కాగానే శాస్త్రవేత్తలు చప్పట్లు చరుస్తూ ఒకరొనొకరు ఆనందం పంచుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి షార్‌లోని మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ ప్రయోగాన్ని వీక్షించి చప్పట్లు చరిచారు. శాస్త్రవేత్తలను అభినందించారు. సోమవారం సాయంత్రం 6.01 నిమిషాలకు కౌంట్‌డౌన్ 0కి చేరిన వెంటనే మొదటిదశ మోటార్లలోని 138 టన్నుల ఘన ఇంధనాన్ని మండించారు. దాంతో సెకనుకు 451 విూటర్ల చోదకశక్తితో పీఎస్‌ఎల్‌వీ-సీ20 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి పయనించింది. 113.14 సెకండ్లు పయనించి 52.1 కిలోవిూటర్ల ఎత్తుకు చేరుకుంది. దాంతో మొదటి దశ మోటార్లు రాకెట్ నుంచి విడిపోతాయి. వెంటనే రెండోదశ మోటార్లను శాస్త్రవేత్తలు పనిచేయించారు. ఈ దశలోని మోటారులో ఉన్న 41.7 టన్నుల ద్రవ ఇంధనంతో రాకెట్ సెకనుకు 1559 విూటర్ల వేగంతో 152 సెకండ్లు పయనించి 222 కిలోవిూటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. దాంతో రెండో దశ మోటార్లు రాకెట్ నుంచి విడిపోవడం, వెంటనే మూడోదశ మోటార్లు పనిచేయడం ప్రారంభమవుతుంది. ఈ మోటారులోని 7.6 టన్నుల ఘన ఇంధనంతో రాకెట్ సెకనుకు 3,590 విూటర్ల వేగంతో 255 సెకండ్లు పయనించి 581 కిలోవిూటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. దాంతో మూడోదశ మోటార్లు రాకెట్ నుంచి విడిపోవడంతో నాల్గవదశ మోటార్లు పనిచేయడం ప్రారంభం అవుతుంది. ఈ దశలోని మోటార్లలో ఉన్న 2.5 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రాకెట్ సెకనుకు 5,283 విూటర్ల వేగం అందుకుని 533 సెకండ్లు పయనించి, 788.9 కిలోవిూటర్ల ఎత్తుకు చేరుతుంది.
ఇలా నాలుగు దశల మోటార్లు 17 నిమిషాల 33 సెకన్లు పనిచేసి రాకెట్‌ను 788.9 కిలోవిూటర్ల ఎత్తులో సూర్యానువర్తన కక్ష్యకు చేరుస్తాయి. దీంతో నాల్గవ దశ మోటారు రాకెట్‌నుంచి విడిపోతుంది.దీంతో ప్రయోగానంతరం 18 నిమిషాల 96 సెకండ్లకు 789.6 కిలోవిూటర్ల ఎత్తులో సరళ్ ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను గతంలో స్పాప్రాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించేవారు. అయితే ప్రస్తుతం ప్రయోగిస్తున్న పీఎస్‌ఎల్‌వీ-సీ20ని స్పాప్రాన్ బూస్టర్లు లేకుండానే ప్రయోగిస్తుండటం విశేషం. ఇలా స్పాప్రాన్ బూస్టర్లు లేకుండా ఇస్రో ఇప్పటికి 8 పీఎస్‌ఎల్‌వీలను
దిగ్విజయంగా ప్రయోగించింది. ప్రస్తుతం 9వ ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్‌ఎల్‌వీ-సీ20రాకెట్ ప్రయోగానికి 240 కోట్లు- ఖర్చు చేసారు. రాకెట్ తయారీకి రూ. 80 కోట్లు-, సరళ్ ఉపగ్రహం తయారీకి రూ. 100 కోట్లు- వినియోగించారు. ప్రయోగంలో ఇతర ఖర్చులకు రూ. 60 కోట్లు- అయినట్లు- సమాచారం. సముద్రంలోని అన్ని రకాల విశేషాలు, ఉపరితల పరిశోధన, జీవరాశుల జీవన క్రమం, సముద్రపు లోతుల్లో జరిగే మార్పులు, తుఫాన్‌లు పరిశోధించడం దీని ప్రత్యేకతగా చెప్పారు. భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా ఈ ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా సరళ్ తరహాలో సముద్రాన్ని పరిశీలించే ఉపగ్రహాలు 5 ఉన్నాయి. ప్రస్తుతం భారత్, ఫ్రాన్స్ భాగస్వామ్యంతో ప్రయోగించబడుతున్న సరళ్ ఆరవది. 6వేల నుంచి 40వేల కిలోవిూటర్ల పరిధిగల కక్ష్యలో ఉన్న అంతరిక్ష వస్తువుల నిఘాకు, వాటి వివరాల సేకరించుటకు ఉపయోగ పడుతుంది. భూస్థిర కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలను, గ్రహ శకలాలను కనిపెట్టి సమాచారం అందజేస్తుంది. అత్యంత కాంతివంతమైన నక్షత్రాల డోలనావర్, వాటి ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలను పరిశీలిస్తాయి. ఆర్కిటిక్ సముద్ర ప్రాంతంలో తిరిగే నౌకల నుంచి ఎఐఎస్ సిగ్నల్స్‌ను స్వీకరించడం, జర్మనీ ఫీనిక్స్ ఉపగ్రహ దిక్సూచిని అధ్యయనం చేయడం చేస్తుంది.