నిప్పువైతే అగ్నిప్రవేశం చెయ్‌

1

పూర్తి ఆధారాలున్నాయి

విచారణకు ఆదేశిస్తే నిరూపిస్తాం

జగదీశ్వర్‌రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడ్డా…పొన్నం

హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి):  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో మాజీ విద్యాశాఖ మంత్రికి 5 శాతం ముడుపులు ముట్టాయని తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆరోపణలు రాగానే రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసిన సీఎం కేసీఆర్‌.. జగదీశ్‌ రెడ్డి వ్యవహారంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తాను నిప్పునంటున్న జగదీశ్‌ నిజాలు నిరూపించాలన్నారు.  సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విూడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడే విధానం సరిగా లేదని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. మంత్రిపై చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా వచ్చామని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని పొన్నం డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ తనది కాదని తప్పించుకుంటున్న జగదీశ్‌ రెడ్డి కాలేజీల యాజమాన్యం నుంచి ముడుపులు ఎవరు తీసుకున్నారో చెప్పాలన్నారు.తాజాగా ఈ వ్యాఖ్యలతో  పొన్నం ప్రభాకర్‌..టీఆర్‌ఎస్‌ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. టీఆర్‌ఎస్‌ మంత్రి జగదీష్‌ రెడ్డిపై ఇటీవలే పొన్నం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సోమవారం పొన్నం విూడియాతో మాట్లాడారు. మంత్రి జగదీష్‌రెడ్డి పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉంటానన్నారు. జగదీష్‌రెడ్డికి దమ్ముంటే కేసు పెట్టాలని సవాల్‌ విసిరారు. అవినీతిని రూపుమాపుతానని చెప్పుకొస్తున్న సీఎం కేసీఆర్‌ అవినీతి పరులకే కొమ్ము కాస్తున్నారని పొన్నం మండిపడ్డారు. అలంపూర్‌ ఎమ్మెల్యే సంపత్‌ తో కలిసి మాట్లాడుతూ ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే రుజువు చేయడానికి సిద్దమని అన్నారు.ప్రభుత్వం తమకు రుజువు చేసే అవకాశం ఇవ్వాలని పొన్నం అన్నారు. తమవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. గత ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఆరోపణలు రాగానే చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎందుకు తాత్సారం చేస్తున్నారని అన్నారు. మంత్రి జగదీష్‌ రెడ్డిపై టోల్‌ ఫ్రీ నెంబర్‌ కు ఫిర్యాదు చేసినా పలితం లేదని ఆయన అన్నారు. మంత్రి కోర్టుకు వెళితే తాము ప్రజాకోర్టులో పోరాడతామని ఆయన చెప్పారు. మంత్రి ఎక్కువగా మాట్లాడితే బండారం అంతా బయటపెడతామని సంపత్‌ హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్‌ తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాననడంతో ఇప్పుడు మంత్రి జగదీష్‌ రెడ్డి ఆ సవాలుకు అంగీకరించవలసిన పరిస్థితి ఏర్పడింది. నిప్పుతో ఆటలాడవద్దని జగదీష్‌ రెడ్డి హెచ్చరించిన నేపధ్యంలో పొన్నం తాజా సవాల్‌ ఆసక్తిగా మారింది. ఫీజ్‌ రీయింబర్స్‌ మెంట్‌ నిదుల విడుదలలో ఐదు శాతం కమిషన్‌ ను విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్‌ రెడ్డి వసూలు చేశారని పొన్నం ఆరోపించారు. ఇదిలావుంటే లక్షకోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రభుత్వం 29శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసిందని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. అల్లుడు, కొడుకు శాఖలకే ఎక్కువ నిధులు కేటాయించారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై వివక్ష చూపుతున్నారని అన్నారు. తెలంగాణలో ఎక్కువ యూనివర్సిటీలు కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయని ఆయన పేర్కొన్నారు. వర్సిటీలను కాంగ్రెస్‌ భ్రష్టు పట్టించిందన్న మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలు విచారకరమని షబ్బీర్‌ అన్నారు.