నిబంధనలు తుంగలో తొక్కి ఇథనాల్ కంపెనీలకు అనుమతులు
` గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుమ్మక్కు రాజకీయాలపై సీఎం రేవంత్ సర్కార్ ఆగ్రహం
` అప్పటి పర్మిషన్ల వివరాలను బయటపెట్టిన ప్రభుత్వం
` ఫ్యూయల్ సాకుతో ‘పెట్టుబడిదారులకు’ అనుకూల నిర్ణయాలు
` అత్యవసరం పేరిట మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఆదేశాలు
` ఎక్కడా ప్రజాభిప్రాయసేకరణ జరగలేదు
` పర్యావరణ శాఖ నిబంధనలు తోసిరాజని ముందుకెళ్లిని గత సర్కారు
రాష్ట్రంలో ఇథనాల్ కంపెనీలకు లభించిన అనుమతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిరచింది. గత బీఆర్‌ఎస్ హయాంలోనే అనుమతలన్నీ మంజూరయ్యాయని వెల్లడిరచింది. అత్యవసరం పేరిట నిబంధనలన్నీ తుంగలో తొక్కారని, ప్రజాభిప్రాయ సేకరణనూ పట్టించుకోలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా గత సర్కార్ పట్టించుకోకపోవడం, పర్యావరణ శాఖ పర్మిషన్లను ఉల్లంఘించడం, ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి అప్రజాస్వామిక చర్యలను సీఎం రేవంత్ సర్కార్ ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలను నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా మోసగించిందని వెల్లడిరచింది.
హైదరాబాద్, నవంబర్ 29 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాలు మాత్రమే అనుమతినిచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇథనాల్, ఎక్స్‌ట్రా, న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ వంటి అన్ని ఉత్పత్తులకు అప్పటి మంత్రివర్గం అనుమతినిచ్చింది. ఇదే అదనుగా ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీకి అనుకూలంగా పర్మిషన్లు ఇచ్చారు. మినహాయంపు కోసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కంపెనీ అడ్డదారులు అనుసరించింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థలు ఎన్వోసీ తీసుకోవాలి. అలా చేయకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ కాంపౌండ్ వాల్ నిర్మించింది. భారాస ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించింది. 2022 అక్టోబర్ 22న గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తుల కోసం గత ప్రభుత్వం ఎల్వోఐ జారీ చేసింది’’ అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
2022 డిసెంబర్‌లోనే ఆమోదం..!
బీఆర్‌ఎస్ ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టిలేషన్స్ నిబంధనలు ఉల్లంఘించిందని రాష్ట్ర సర్కార్ నివేదికలో వెల్లడైంది. 2022 అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తుల కోసం గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెట్ జారీచేసిందని వాటికి సంబంధించిన దస్త్రాలను బయటపెట్టింది. 2022 డిసెంబర్‌లో ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై చేసిందని తెలిపింది. 2023 ఫిబ్రవరి 24న కేంద్రం ఫ్యూయల్ ఇథనాల్‌కు అనుమతిచ్చిందని పేర్కొన్న సర్కార్.. 2023 జూన్ 15న నీటి కేటాయింపులు, 2023 డిసెంబర్ 7కు ముందే టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చిందని తెలిపింది. తాజాగా రేవంత్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ నేతలు.. వారి ప్రభుత్వంలోనే ఆగమేఘాల మీద కేసీఆర్ అనుమతులు మంజూరు చేసినట్టు సంబంధిత పత్రాలను విడుదల చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.