నిముషం ఆలస్యం…అభ్యర్థి ఆత్మహత్య

న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా వెళ్లినందుకు ఓ అభ్యర్థిని అనుమతించకపోవడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేంద్రంలోకి అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత అభ్యర్థి తను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని రాజేంద్రనగర్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన వరుణ్‌(28) అనే యువకుడు గత కొంతకాలం నుంచి సివిల్స్‌కు ప్రిపేర్‌అవుతున్నాడు. నార్త్‌ ఢిల్లీలోని పహార్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లాడు వరుణ్‌.దీంతో ఆ అభ్యర్థిని అధికారులు పరీక్షకు అనుమతించలేదు. చాలా కాలం నుంచి సివిల్స్‌ లక్ష్యంగా ప్రిపేర్‌ అవుతుండటంతో.. చివరి నిమిషంలో పరీక్షకు అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు వరుణ్‌. చేసేదిమి లేక తాను ఉంటున్న గదికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ గదిలో పోలీసులకు సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. తన తల్లిదండ్రులకు క్షమాపణ కోరుతున్నానని.. తనను మరిచిపోవాలని సూసైడ్‌నోట్‌లో వరుణ్‌ పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.