నిరుద్యోగ ఉపాధ్యాయులకు శుభవార్త

జులైలో 22 వేల ఉద్యోగాలు
మంత్రి పార్థసారథి
చిత్తూర్‌, జూన్‌ 27 (జనంసాక్షి) :
నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నియామక ప్రక్రియపై మంత్రి నోరు విప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 22 వేల ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే నియమిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ జూలై నెలలో ప్రకటన విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలోగాని, ప్యాకేజీల విషయంలో కాని ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామన్నారు. గతంలో లాగా సీమాంధ్రకు చెందిన వ్యక్తులు ఎవ్వరూ వ్యతిరేకించరని మంత్రి పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించి రెండు ప్రాంతాల్లో నెలకొన్న వైషమ్యాలను తగ్గించాలని కోరుతున్నామన్నారు. ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యల్లో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంటే టీడీపీ మాత్రం రాజకీయం కోసం చేస్తున్నట్లుగానే ఉందన్నారు. సమస్య తీవ్రంగా ఉన్నసమయంలో విహార యాత్రలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చీ రాగానే డెహ్రాడూన్‌, ఢల్లీిలకు వెళ్లి ఏదేదో ఇరగతీస్తున్నామని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు అడ్డు తగులుతూ వీది రౌడీల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.