నిరుపేదల ఆకలి తీర్చని రేషన్ బియ్యం…
పానుగంటి విష్ణువర్ధన్
కేసముద్రం సెప్టెంబర్ 7 జనం సాక్షి / తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి ఉచితంగా రేషన్ బియ్యంను పంపిణీ చేస్తూ పేదరిక నిర్మూలనలో ముందున్నాం అని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసముద్రం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి విష్ణువర్ధన్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో పత్రిక ప్రకటన విడుదల చేసి ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కేసముద్రం మండలంలో రేషన్ డీలర్లు పేదలకు పంపిణీ చేసే బియ్యం పంపిణీలో కృత్రిమ కొరత సృష్టిస్తూ సగం సన్న బియ్యం సగం దొడ్డు బియ్యం పంపిణీ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొంతమంది డీలర్లు సగం సన్న బియ్యం ఇస్తూ దొడ్డు బియ్యానికి సంబంధించి వినియోగదారులకు తిరిగి డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు.పంపిణీ చేయకుండా దాస్తున్న బియ్యం నిల్వలు ఎవరికి సరఫరా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.అదేవిధంగా రాజకీయ నాయకుల అండదండలతో పేరున్న నాయకులతో కుమ్మక్కై బియ్యం రీసైక్లింగ్ దందాకు పరోక్షంగా రేషన్ డీలర్లు సహకరిస్తున్నారని ఆయన అన్నారు.అదే విధంగా ప్రజల ఆలోచన విధానం కూడా మార్చుకోవాలని ప్రతీ ఒక్కరూ ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి అని అన్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యల పై స్పందించి నిరుపేద ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ మండల అధ్యక్షుడు కొనకటి మహేందర్ రెడ్డి ,ఉపాధ్యక్షుడు వనం విద్యాసాగర్ ,పోతుల రవి,అమర్రాజు రాజు తదితరులు పాల్గొన్నారు.