నిరుపేదల సొంతింటి కల సాకారమైంది
– రాష్ట్ర మంత్రి నారాయణ
– నెల్లూరు జిల్లాలో 19,200 ఇళ్లకు గృహప్రవేశాలు
నెల్లూరు, జులై 5(జనం సాక్షి) : నిరుపేదల సొంతింటి కల సాకారమైంది.. ప్రభుత్వ సాయంతో నిర్మించుకున్నసొంత ఇళ్ళను చూసి లబ్ధిదారుల ఆనందానికి హద్దుల్లేవు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. గురువారం నెల్లూరు జిల్లాలోని 19,200 ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలోని మునిసిపాలిటీల పరిధిలో 2093 వార్డుల్లోను, 12,767 గ్రామపంచాయతీలలోను 3లక్షల గృహప్రవేశాలను గురువారం నిర్వహించినట్లు వెల్లడించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54 వ.డివిజన్లో ఎన్టీఆర్ సామూహిక గృహ ప్రవేశాలను ప్రారంభించిన మంత్రి నారాయణ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. 2022 నాటికి రాష్ట్రంలో ఇల్లులేని పేదవారు ఉండకూడదని ఒక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నిర్దేశించారని.. అందులో భాగంగానే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు. పేదలుసొంతంగా నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.1.5లక్షలు సహాయం చేస్తుందని. ఐటీడీఎ పరిధిలోని ఎస్టీ గృహాలకు 50,000 మైదాన ప్రాంతంలోని ఎస్టీ గృహాలకు 25,000 అదనంగా చెల్లించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. అంతేకాకుండా ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారుస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 14.4 లక్షల ఇళ్లు అత్యంత నాసిరకంగా కట్టారని.. దీనివల్ల 4200 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని వివరించారు. ఒక్క నెల్లూరులోనే 4600 రేపో, మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పేదలకు కూడా సంపన్నులతో సమానంగా నాణ్యమైన ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తోందని నారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.