నిర్భయ కేసు ప్రధాన నిందితుడి ఆత్మహత్య
తీహార్ జైల్ భద్రతలో లోపాలున్నాయి : షిండే
న్యూఢిల్లీ, మార్చి 11 (జనంసాక్షి) :
ఢిల్లీ అత్యాచార ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. ‘నిర్భయ’పై దారుణానికి ఒడిగట్టిన గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు రాంసింగ్ (23)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే తీహార్ జైలులో నిందితుడు ఉరేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేంద్ర ¬ం శాఖ న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే, నివేదిక సమర్పించాలని తీహార్ జైలు అధికారులకు సూచించింది. తీహార్ జైలులో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. తీహార్ జైలు నెంబర్ 3లో ఉంటున్న ఇద్దరు ఖైదీలతో ఉంటున్న రాంసింగ్ తన దుస్తులతో వెంటిలేటర్‌కు ఉండే ఇనుప కడ్డీలకు ఉరి వేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మృతదేహాన్ని డిసెంబర్ 16న ఢిల్లీలో యువతిపై దారుణ హత్యాచారానికి పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్, మిగతా నలుగురు నిందితులను తీహార్ జైలులో ఉంచారు. సోమవారం వారిని కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాంసింగ్ జైలులోని తన వార్డులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దుస్తులను తాడుగా చేసుకొని కిటికీలకు ఉండే గ్రిల్స్‌కు కట్టి ఉరి వేసుకున్నాడని జైలు అధికారులు తెలిపారు. ‘రాంసింగ్ ఒక్కడే సెల్‌లో ఉండడం లేదు. మరో ఇద్దరు ఖైదీలు కూడా ఉంటున్నారు. ఓ గార్డు అక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు. ఉదయం 5 గంటల సమయంలో ఆయన ఉరి వేసుకున్నట్లు గుర్తించాం’ అని జైలు అధికారులు తెలిపారు. కొంతకాలంగా ఆయన మానసిక వేదనతో బాధ పడుతున్నాడని పేర్కొన్నారు. అత్యాచార ఘటనపై ప్రాయశ్చిత్తంతో కనబడ్డాడని, ఉరిశిక్ష పడుతుందనే ఆందోళనలో ఉన్నాడని, రాత్రి భోజనం కూడా చేయలేదన్నారు. మానసిక ఆందోళనలతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తెలిపారు. కిటికీకి వేలాడుతుండడాన్ని గమనించిన జైలు సిబ్బంది తక్షణమే అతడిని జైలులోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అయితే, కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలులో ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. అయితే, తెల్లవారుజామున 5 గంటలకు చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేంద్ర ¬ం శాఖ విచారణకు ఆదేశించింది. ‘ప్రధాన నిందితుడి ఆత్మహత్యపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది’ అని కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే, రాంసింగ్ ఆత్మహత్యపై మేజిస్ట్రేట్ విచారణ ప్రారంభమైంది. రాంసింగ్ మృతదేహాన్ని దీన్‌దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టంలో ఆయన మృతికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు, ఫోరెన్సిక్ నిపుణులు రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్న సెల్‌ను పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. మరోవైపు, రాంసింగ్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రాంసింగ్ మృతితో నిర్భయకు న్యాయం జరిగిందన్న హర్షం వ్యక్తం కాగా, మరికొందరు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాంసింగ్ ఆత్మహత్యపై నిర్భయ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తామేమీ థ్రిల్ల్‌గా ఫీల్ కాలేదని నిర్భయ సోదరుడు అన్నారు. తాను చావబోతున్నాననే విషయం రాంసింగ్‌కు తెలుసునని, అతనికి వ్యతిరేకంగా అందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయని అతను అన్నాడు. రాంసింగ్‌ను బహిరంగంగా ఉరి తీయాలని తాము కోరుకున్నామని అన్నారు. మరోవైపు, తీహార్ జైలు భద్రతపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మమతాశర్మ మండిపడ్డారు. అండర్‌ట్రయల్ ఖైదీలకు రక్షణ లేకుండా పోయిందని, రాంసింగ్ ఆత్మహత్యపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తీహార్ జైలు మాజీ డైరెక్టర్ జనరల్ కిరణ్‌బేడీ కూడా విచారణ జరపాలని కోరారు. డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయపై ఆరుగురు దుండగులు దారణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. రాజధాని వీధుల్లో బస్సులో తిప్పుతూ దారుణానికి ఒడిగట్టారు. అత్యాచారం చేయడమే కాకుండా కిరాతకంగా వ్యవహరించారు. సున్నితావయవాలను తీవ్రంగా గాయపరచి, రోడ్డుపై తోసేసి హత్య చేసేందుకు యత్నించారు. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ చివరకు డిసెంబర్ 29న సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. దీంతో ప్రభుత్వం అత్యాచార నిరోధక చట్టానికి పదును పెట్టడంతో పాటు కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. మరోవైపు, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డిల్లీ పోలీసులు ప్రధాన నిందితుడు రాంసింగ్‌ను ఆర్‌కేపురంలో అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన వివరాల ఆధారంగా మరో ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాట్లాడుతూ తీహార్ జైలు భద్రత లోపాలున్నట్లు అంగీకరించారు. అండర్ ట్రయల్ ఖైదీ జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడంటే భద్రత పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భద్రతా లోపానికి ప్రతీక అన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామని చెప్పారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు చేపడుతామని తెలిపారు.