నిర్మల్‌లో విస్తరిస్తున్న రియల్ మాఫియా
చూసీచూడనట్లుగా మున్సిపల్ అధికారులు
నిర్మల్,ఏప్రిల్20(జనంసాక్షి): నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో స్తిరాస్థి వ్యాపారం జోరందుకొంది. ఎక్కడ ఖాళీభూమి కనిపించినా స్తిరాస్థి వ్యాపారులు వాలిపోయి వాటిని తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుమతి కోసం పురపాలక సంఘానికి చెల్లించాల్సిన రుసుమును ఎగవేస్తున్నారు. భూమి మార్పిడి చేయకుండానే పంట పొలాలను ఇళ్ల స్థలాలుగా మార్చుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం.. వనరులు, వసతులు అందుబాటులో ఉండటంతో రోజురోజుకూ విస్తరిస్తోంది. పల్లె ప్రజలు పట్నం దారిపట్టడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. పెద్ద నోట్ల నేపథ్యంలో మొన్నటివరకు స్తబ్దుగా ఉన్న స్థిరాస్తి వ్యాపారం మళ్లీ జోరందుకొంది. జిల్లా కేంద్రంలోని శివారు పంటపొలాలన్నీ ప్లాట్లుగా మారుతున్నాయి. అనుమతులు లేకుండా లేఅవుట్లు చేస్తూ పురపాలక సంఘానికి లక్షల్లో ఆదాయానికి గండిపడుతున్నా అధికార యంత్రాంగం మిన్నకుండిపోతున్నారన్న వాదన ఉంది. పట్టణం చుట్టుపక్కల అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు ఏర్పడుతున్నాయి. న్నులు చెల్లించకపోవడం ఆ స్థలాల్లో రహదారులు, మురుగుకాలువలు, విద్యుత్తు, తదితర వసలేవీ కల్పించడం లేదు. ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూస్తూ ఉండిపోవడంతో పట్టణ శివారు అక్రమ లే అవుట్ల దందా జోరుగా సాగుతోంది. అయితే పెరుగుతున్న ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది స్థిరాస్తి వ్యాపారం చేస్తూ మున్సిపాల్టీకి లక్షల్లో రుసుము ఎగ్గొడుతున్నారు. ఇందుకోసం ఎక్కడపడితే లేఅవుట్లను
రూపొందించారు. కాల్వలు, కుంటలు, పంటపొలాలు, గుట్టలు.. ఇలా ఏ ప్రదేశం అందుబాటులోఉన్నా.. ఆ స్థలాలను లేఅవుట్‌గా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలోని సిద్దాపూర్, ఆదర్శనగర్, సోఫినగర్, రాంనగర్, గాజులపేట్, విశ్వనాథ్‌పేట్, వైఎస్సార్ నగర్‌కాలనీ, ప్రియదర్శినినగర్, పట్టణ శివారులోని జాతీయరహదారిని ఆనుకొని అక్రమ లేఅవుట్లు చేశారు. వీటిల్లో వందలాది ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. కనీస అనుమతులు లేకుండానే ఈ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట లేకపోవడం, కొంతమంది స్తిరాస్థి వ్యాపారులకు రాజకీయ పార్టీల అండదండలు ఉండటంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిర్మల్ పట్టణంలో అన్ని వసతులు అందుబాటులో ఉండటంతో చుట్టూ ప్లలెవాసులు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. రోజురోజుకు భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పట్టణానికి ఆనుకొని ఉన్న మండలంలోని మంజులాపూర్, తల్వెద, కడ్తాల్, కొండాపూర్, లండ్డాపూర్, వెంగ్వాపేట్, సారంగాపూర్ మండలం చించోలి(బి) గ్రామాల్లో విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించి అక్రమంగా లేఅవుట్లు చేస్తున్నా.. అధికారులు మాత్రం అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవడం లేదు. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమంటూ పురపాలక సంఘ అధికారులు ప్రకటనలు చేసి మిన్నకుంటున్నారన్న భావన ఉంది. అధికారులు పట్టింపులేకుండా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు చేసి ప్లాట్లు విక్రయిస్తే వాటిని తొలగిస్తామని మున్సిపల్ అదికారులు హెచ్చరిస్తున్నారు.