నిర్మల్‌ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 

అధికారులకు సూచనలు చేసిన మంత్రి
నిర్మల్‌,మే9(జ‌నం సాక్షి):ఈ నెల 10నుంచి 17వరకు వారం రోజుల పాటు చెక్కుల పంపిణీ షెడ్యూల్‌ నిర్ణయించిన ఏరకు జిల్లా అధికార యంత్రగాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గ్రామస్థాయిలో చెక్కుల పంపిణీ కోసం 138బృందాలను ఏర్పాటు చేయగా.. వీటికి ఏఈవోలు, ఏవోలు బాధ్యులుగా ఉంటారు. చెక్కుల పంపిణీలో గ్రామ స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, డీఆర్‌డీఏతో పాటు ఐసీడీఎస్‌ శాఖలను
భాగస్వాములు చేస్తున్నారు. మండల స్థాయిలో పర్యవేక్షణ కోసం ప్రతి మండలానికో జిల్లా స్థాయి అధికారిని నియమించారు. రైతుబంధు పథకం కింద చెక్కుల పంపిణీతో పాటు రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందని వారు ఆధార్‌ కార్డు జీరాక్స్‌ చూపితే పెట్టుబడి సాయం చెక్కులు అందజేస్తారు. చెక్కుల పంపిణీతో పాటు కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో ఎలాంటి సమస్యలు లేకుండా.. రైతులకు సక్రమంగా అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి కన్వీనర్లతో సవిూక్ష నిర్వహించారు. జిల్లాలో జరిగే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
నిర్మల్‌-1 వ్యవసాయ డివిజన్‌కు డీఆర్‌డీవో, నిర్మల్‌-2కు నిర్మల్‌ ఆర్డీవో, భైంసాకు డీసీఓ, ముథోల్‌లో భైంసా ఆర్డీవో, ఖానాపూర్‌ వ్యవసాయ డివిజన్‌కు డీఎఫ్‌వోను నియమించారు. ఒక్కో బృందం 300వరకు చెక్కులు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. 300మందికి మించి రైతులుంటే మరో కౌంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. కౌంటర్ల వద్ద నీడ కోసం షామియానాలు, దాహార్తి తీర్చేందుకు అవసరమైన నీటి ఏర్పాట్లు చేస్తున్నారు.  చెక్కులను,పాస్‌ పుస్తకాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి.. ఎలాంటి తప్పులు లేని వాటిని పంపిణీ చేయనున్నారు. ఈ నెల 10న ఒకే చోట రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి.. రైతులకు అవసరమైన నీరు, నీడ కల్పించాలని.. ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు సంక్షేమాన్ని  దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమ కార్యక్రమాలు అమలవు తున్నాయని అన్నారు. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.8వేల చొప్పున ఇవ్వడం అంటే ఆషామాషీ విషయం కాదన్నారు. గడిచిన నాలుగేండ్లలోనే తెలంగాణ రైతాంగానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అందించిందని గుర్తు చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వడమనేది గొప్ప విషయమన్నారు. రైతులకు అందే పట్టాదారుపాసుబుక్‌లు పకడ్బందీగా తయారు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని పంట దిగుబడులు సాధించాలని కోరారు. నిర్మల్‌ నియోజకవర్గ రైతులు అహర్నిశలు శ్రమించి పంట ఉత్పత్తులు సాధిస్తారని కొనియాడారు.
———

తాజావార్తలు