నిర్లక్ష్య వల్లనే కోటిలింగాల ప్రమాదం

బాధ్యులను కఠినంగా శిక్షించాలి: బిఎస్పి

వరంగల్‌,జూలై5(జ‌నం సాక్షి): కోటిలింగాల బాణాసంచా కర్మాగారం వద్ద జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గంధం శివ డిమాండ్‌ చేశారు. వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ అమ్రపాలికి గురువారం బహుజన్‌ సమాజ్‌ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గంధం శివ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాము సంఘటన స్థలానికి వెళ్ళి చూస్తే హృదయ విదారకంగా ఉందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించక పోవడం కారణంగా ప్రమాదం జరిగిందని ఆరోపించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ప్రభుత్వానికి తగదన్నారు. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్షతగాత్రులకు తక్షణం రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. బాధిత కుటుంబాలకు డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.