నిర్వాసితులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌12(జ‌నం సాక్షి): భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించి నిరంతరంగా సాగునీటిని అందించాలని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని గ్రామాల్లో ఉన్న 8600 ఎకరాల సాగుభూమికి భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా నీరందించాలని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రైతులకు ఉపయోగపడేలా జరగాలన్నారు. అభివృద్ధి పేరుతో అనేక ప్రాజెక్టులను పునరాకృతి చేపట్టి వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలన్నారు. అవసరం లేనిచోట వేలకోట్లతో రిజర్వాయర్‌లు నిర్మిస్తున్నారన్నారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసిన నాటినుంచి ఆరు మాసాల్లోనే రూ.98 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెంచి రాజకీయ నాయకులు, గుత్తేదారులు తమ జేబులు నింపుకొంటున్నారని ఆరోపించారు. ఇక్కడ జరిగే నాణ్యతలేని పని విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమన్నారు. అనేక సమస్యలు గ్రామాల్లో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత సమస్యలుండవని చెప్పిన సిఎం కెసిఆర్‌ ప్రజల సమస్యల విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవడం లేదన్నారు. సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను విస్మరించి, ప్రజలతో ఓట్లు వేయించుకొని పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారన్నారు. రైతుల సమస్యల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కేవలం సీట్లు తమకుంటే చాలు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు.