నిలిచిన బొగ్గు ఉత్పత్తి ..
– ప్రాజెక్టులు, జలపాతాలకు జలకళ
ఆదిలాబాద్, జులై7(జనం సాక్షి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓసీపీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు మొదటి షిఫ్ట్ పనులు నిలిచిపోయాయి. దీంతో 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 60 వేల క్యూబిక్ విూటర్ల ఓబీ మట్టి తరలింపు పనులకు విఘాతం కలిగింది. మందమర్రి ఏరియాలోని ఆర్కేపీ ఓసీపీలోనూ బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాల్‌పల్లి, ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి వరద చేరుతోంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో ప్రారంభించారు. మత్తడి తొక్కిన పలు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇదిలా ఉంటే కుంటాల, బొగత జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.. అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు పొంగిపొర్లుతుండటంతో కుంటాల జలపాతం కనువిందు చేస్తోంది. దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టులోకి 3800 క్యూసెక్కులు, భీంఫూర్ మండలం మత్తడి ప్రాజెక్టులోకి 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఆసిఫాబాద్‌లోని అడ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీరు భారీగా వస్తుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొగత జలపాతం పొంగి పొర్లుతోంది. కీకారణ్యంలో జల సవ్వడి పర్యాటకులకు వీనుల విందు చేస్తోంది. అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. జగిత్యాల, మంచిర్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం కూడా పలు జిల్లాల్లో విస్తారంగా వానలు కురిశాయి.
ప్రాజెక్టులకు జలకళ ..
భారీగా వరద నీరు వచ్చి చేరడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి 853 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శనివారంకు ప్రాజెక్టు నీటి మట్టం 1058 అడుగులకు చేరుకుంది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం శుక్రవారం సాయంత్రానికి 689 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ధర్మారంలో 12 సెం.విూ. వర్షపాతం నమోదు కావడం విశేషం.