నివేదిక బహిర్గతం విశ్వాస ఘాతుకమే
బొగ్గు స్కామ్ దర్యాప్తు నివేదికపై సీబీఐకి సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30 (జనంసాక్షి):
బొగ్గు కుంభకోణం దర్యాప్తు అంశానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణానికి సంబం ధించిన కేసు విచారణ సందర్భంగా మంగళవారం నాడు సుప్రీంకోర్టు సీబీఐ చర్యను తప్పుబట్టింది. దర్యాప్తు స్థాయి నివేదికను రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులకు ముందుగా చూపడంపై సీబీఐ చర్య పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఆర్‌ఎంలోభా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టుకు నివేదిక సమర్పించకుండా తప్పుదోవ పట్టించిందని సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు వాస్తవాలు తెలియకుండా తొక్కిపెట్టడం సమంజసంకాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో ముందుగా దర్యాప్తు స్థాయి నివేదిక వివరాలను పంచుకోవడం సాధారణ విషయం కాదని కూడా కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 26న సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా కోర్టుకు సమర్పించిన మిగతా 2లోఅఫిడవిట్ తీవ్ర గందరగోళంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాని కార్యాలయ అధికారులతోపాటు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు, న్యాయశాఖ మంత్రి అశ్వనికుమార్‌తో దర్యాప్తు స్థాయి నివేదిక సమాచారాన్ని సిన్హా రెండు పేజీల అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి నివేదిక చూపించామని కోర్టుకు ఎందుకు చెప్పలేదని ధర్మాసనం సీబీఐని ప్రశ్నించింది. దర్యాప్తు నివేదిక ప్రభత్వానికి తెలియజేయడం ద్వారా దర్యాప్తు ప్రక్రియ మొత్తం బలహీనమైందని వ్యాఖ్యానించింది. సీబీఐపై ఉంచిన విశ్వాసాన్ని ఈ చర్యతో ఆ సంస్థ కోల్పోయిందని, ఇది పునాదులను కుదిపేసే విశ్వాస ఘాతుక చర్య అని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజకీయ నేతల నుంచి సీబీఐ ఎలాంటి సూచనలను తీసుకోవాల్సిన అవసరం లేదని హితవు పలికింది. సీబీఐకి స్వయంప్రతిపత్తిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు తాము ముందుగా ప్రయత్నిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయాల నుంచి సీబీఐని కచ్చితంగా వేరు చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ తీరుపట్ల సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేంద్రానికి ఇచ్చిన నివేదికనే కోర్టుకు సమర్పించడంలో సీబీఐకి ఉన్న అభ్యంతరాలేమిటని ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తులో రాజకీయ నాయకుల జోక్యం తగదని వ్యాఖ్యానించింది.
కాగా ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల సీబీఐ హర్షం వ్యక్తం చేసింది. అటార్ని జనరల్ జీఈ వాహనవతికి అదనపు సొలిసిటర్ జనరల్ హరీన్‌రావల్ రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. బొగ్గు స్కాంకు సంబంధించి సీబీఐ దర్యాప్తు నివేదిక విషయంలో ఆయన ఒత్తిడి వల్లే కోర్టు ఎదుట తాను వాస్తవ సమాచారాన్ని అందించలేకపోయానని రావల్ పేర్కొన్నారు. దర్యాప్తు స్థాయి నివేదికకు సంబంధించిన సమాచారం వాహనవతికి పూర్తిగా తెలుసునని హరీన్ రావల్ పేర్కొనడంతో న్యాయవాది వర్గాల్లో కలకలం రేగింది. అనవసరంగా తనను వివాదంలోకి లాగుతున్నారంటూ వాహనవతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగాతాజా పరిణామాల నేపథ్యంలో అటార్ని జనరల్ వాహనవతి స్థానంలో మంగళవారం నాడు ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ కోర్టులో హాజరయ్యారు. మొత్తంమీద సుప్రీంకోర్టు సీబీఐపై చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఇరుకున పడింది.